అరుదైన ‘బుండిబుగ్యో’ ఎబోలా వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..
వ్యాక్సిన్ లేని అరుదైన ఎబోలా వైరస్.. ప్రపంచ దేశాలకు హెచ్చరిక..
కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆదివారం అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాల నుంచి నగరాల వరకు ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.
డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 88 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉండటంతో వైద్య బృందాలు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితి కరోనా మహమ్మారి తరహాలో లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన పరిస్థితి లేదని తెలిపింది. వ్యాధి నియంత్రణకు ఆయా దేశాల ప్రభుత్వాలతో కలిసి చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
ఈసారి వ్యాప్తి చెందుతున్న వైరస్ ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వేరియంట్‌గా గుర్తించారు. ఇది సాధారణ ఎబోలా వైరస్ కంటే భిన్నంగా ఉండటం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్‌కు ఇప్పటివరకు ప్రత్యేక చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత ప్రమాదకరంగా భావిస్తున్నారు.
కాంగో, ఉగాండా దేశాలు గతంలో కూడా ఎబోలా బారిన పడ్డాయి. అయితే ‘బుండిబుగ్యో’ వేరియంట్ మొదటిసారి 2007-2008 మధ్య ఉగాండాలో వెలుగుచూసింది. అప్పట్లో 37 మంది మరణించారు. అనంతరం 2012లో కాంగోలోని ఇసిరో ప్రాంతంలో మళ్లీ ఈ వైరస్ వ్యాపించి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి అదే వేరియంట్ వెలుగు చూడటం ప్రపంచ ఆరోగ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ మరింత విస్తరించకుండా ప్రపంచ దేశాలు కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.