Indian Worker Deaths: విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న భారతీయ కార్మికుల భద్రతపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో (2021-2025) విదేశాల్లో మరణించిన భారతీయ కార్మికుల వివరాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 37,740 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు 20 మందికి పైగా మరణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మొత్తం మరణాల్లో 86 శాతం కంటే ఎక్కువ మరణాలు ఒక్క గల్ఫ్ ప్రాంతంలోనే సంభవించడం గమనార్హం. ఉపాధి కోసం అక్కడికి వెళ్లే కార్మికులు ఎదుర్కొంటున్న కఠినమైన పని పరిస్థితులు, వాతావరణ మార్పులు లేదా ఇతర ప్రమాదాలు ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశాల వారీగా చూస్తే, అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 12,380 మంది కార్మికులు మరణించారు. దీని తర్వాత స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది, అక్కడ 11,757 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దేశాల్లోనే మరణాల సంఖ్య వేలల్లో ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వీటితో పాటు కువైట్ (3,890), ఒమన్ (2,821), ఖతార్ (1,760) వంటి దేశాల్లో కూడా మరణాల రేటు గణనీయంగా ఉంది.
గల్ఫ్ దేశాలే కాకుండా ఇతర దేశాలైన మలేషియాలో 1,915 మంది, అమెరికాలో 454 మంది, సింగపూర్‌లో 451 మంది భారతీయులు మరణించారు. నైజీరియా (210) బ్రిటన్ (188) వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గల్ఫ్ ఆసియా దేశాల్లో పని చేస్తున్న కార్మికులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఈ డేటా ద్వారా తెలుస్తోంది.
ఈ గణంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదని, వేల కుటుంబాల విషాదానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో భారతీయ కార్మికుల రక్షణ కోసం మరింత పటిష్టమైన చట్టాలు, మెరుగైన వైద్య సౌకర్యాలు పని ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.