మహిళల్లో కనిపించే గైనకాలజికల్ (స్త్రీ సంబంధ) క్యాన్సర్ల చికిత్సలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన వైద్య రంగానికి కొత్త ఆశను అందిస్తోంది. రేడియేషన్ చికిత్స సమయంలో క్యాన్సర్ కణితి (ట్యూమర్) పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన అవయవాలకు తక్కువ నష్టం కలిగేలా చేయడమే లక్ష్యంగా ఈ అధ్యయనం సాగింది. ఇందుకోసం ‘స్టెబిలైజ్డ్ హయలురోనిక్ యాసిడ్ (sHA)’ అనే ప్రత్యేక జెల్‌ను ఉపయోగించి, ట్యూమర్‌కు – సమీప అవయవాలకు మధ్య భద్రతా దూరాన్ని పెంచే విధానాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ పద్ధతి సురక్షితమని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని పరిశోధనలో వెల్లడైంది.
మోనాష్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం ఈ కీలక అధ్యయనాన్ని నిర్వహించింది. అంతర్గత రేడియేషన్ చికిత్సగా పిలిచే బ్రాకీథెరపీ సమయంలో, క్యాన్సర్ కణితి మరియు పురీషనాళం (రెక్టమ్) మధ్య sHA జెల్‌ను ప్రవేశపెట్టి ఖాళీని సృష్టించారు. దీని వల్ల పురీషనాళంపై పడే రేడియేషన్ ప్రభావం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో క్యాన్సర్ కణితిపైకి మరింత కచ్చితంగా, అధిక మోతాదులో రేడియేషన్ పంపేందుకు అవకాశం ఏర్పడింది. ఇది చికిత్స ఫలితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించగలదని వైద్యులు చెబుతున్నారు.
ఈ పరిశోధనలో భాగంగా 12 మంది గైనిక్ క్యాన్సర్ రోగులపై ఈ జెల్ వినియోగాన్ని పరీక్షించారు. జెల్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ చాలా సులభంగా జరిగిందని, ఎంఆర్ఐ స్కాన్లలో ఇది స్పష్టంగా కనిపించిందని వైద్య బృందం వెల్లడించింది. ముఖ్యంగా రోగులకు ఎలాంటి నొప్పి, అసౌకర్యం లేదా దుష్ప్రభావాలు నమోదు కాకపోవడం ఈ అధ్యయనానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. చికిత్స సమయంలో రోగుల భద్రతను కాపాడుతూ, ప్రభావవంతమైన రేడియేషన్‌ను అందించడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ sHA జెల్ పూర్తిగా కొత్తది కాదు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో దీనికి అనుమతి ఉంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, ఇది క్రమంగా సురక్షితంగా కరిగిపోతుంది. గైనిక్ క్యాన్సర్లలో ఈ జెల్ వినియోగాన్ని పరీక్షించిన ప్రపంచంలోనే తొలి అధ్యయనం ఇదేనని పరిశోధన బృందం పేర్కొంది. “ఈ విధానం సురక్షితమని మా ఫలితాలు నిరూపిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన, రోగులకు అనుకూలమైన క్యాన్సర్ చికిత్సలకు ఇది మార్గం సుగమం చేస్తుంది” అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ కార్మినియా లాపుజ్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ మెడికల్ రేడియేషన్ సైన్సెస్’లో ప్రచురితమయ్యాయి.