- Cinema: వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం…
- చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి..
Chandrabose: ప్రముఖ సినీ గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా కలికిరిలో గుండెపోటుతో కన్నుమూశారు. వ్యాపార నిమిత్తం బెంగళూరు నుంచి వచ్చిన ఆయన, శనివారం రాత్రి కలికిరిలోని తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేశారు. అయితే ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. ఆ తర్వాత కలికిరి క్రాస్ రోడ్డు సమీపంలోని ఒక హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో రాజేంద్రకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
ఈ విషాద వార్త తెలియగానే కలికిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాజేంద్ర మృతి చెందిన విషయాన్ని వెంటనే చంద్రబోస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజేంద్ర ఆకస్మిక మరణంతో కలికిరి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై తెలుగు ఖ్యాతిని చాటిన చంద్రబోస్ సోదరుడు ఇలా అకస్మాత్తుగా మరణించడం పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చంద్రబోస్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.