తమిళనాడులో జరిగిన ఓ విచిత్ర ఘటన స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీస్తోంది. నెలకు కేవలం రూ.8 వేలు మాత్రమే జీతం తీసుకునే ఓ మహిళకు, ఏకంగా రూ.13 కోట్ల జీఎస్టీ బకాయిలు రావడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తారుమారైంది. వెల్లూర్ జిల్లాలోని గుడియతమ్ ఏరియాలో నివసించే యశోద అనే మహిళకు ఈ నోటీసులు రావడంతో ప్రాంతంలో కలకలం రేగింది. సాధారణ ఉద్యోగినిగా జీవనం సాగించే తన పేరుమీద ఇంత పెద్ద మొత్తంలో పన్ను బకాయి ఎలా చేరిందన్న సందేహంతో ఆమె షాక్‌కు గురైంది. జీతం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లినపుడు అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని అధికారులు చెప్పడంతో అసలు సమస్య వెలుగులోకి వచ్చింది.
గుడియతమ్ నగల్ ప్రాంతానికి చెందిన మహాలింగం కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య యశోద ఒక ప్రైవేట్ షూ కంపెనీలో కార్మికురాలిగా పని చేస్తోంది. ప్రతీ నెలా వచ్చే రూ.8 వేల జీతమే కుటుంబానికి ప్రధాన ఆదారం. అయితే ఇటీవల జీతం విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లినప్పుడు ఖాతా బ్లాక్ అయినట్లు తెలిసింది. ఆమె ఆరా తీయగా—తన పేరుమీద జీఎస్టీ బకాయి ఉందని, మొత్తం రూ.13 కోట్లను చెల్లించాల్సి ఉందని బ్యాంక్ అధికారులు తెలిపారు. సాధారణ ఉద్యోగినిగా జీవనోపాధి నెరపుతున్న తనకు ఇంత భారీ మొత్తం ఎందుకు బకాయి పడిందో అర్థం కాక యశోద అవాక్కయ్యింది. దీంతో వెంటనే సంబంధిత విభాగాలను సంప్రదించగా సరైన వివరణ మాత్రం లభించలేదు.
ఆమె చెన్నై జీఎస్టీ కార్యాలయాన్ని సంప్రదించినా పెద్దగా ఉపయోగం కాలేదని యశోద తెలిపింది. వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అధికారులు తమ రికార్డుల్లో ఆమె పేరుమీద రూ.13 కోట్ల బకాయిలు ఉన్నట్లు మాత్రమే చెప్పారని వాపోయింది. తన ఆదాయం, ఉద్యోగం, జీవన శైలిని పరిశీలిస్తే ఇలాంటి నోటీసులు తప్పుగా జారీ అయ్యాయని స్పష్టమేనని యశోద చెబుతోంది. ఈ గందరగోళం కారణంగా ఆమె బ్యాంకు ఖాతా పునరుద్ధరించకపోవడం వల్ల నెల జీతం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ ఖర్చులు, అవసరాలు అన్నీ ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సాధారణ ఉద్యోగులు ఇలాంటి తప్పిదాల వలన ఇబ్బందులు పడటం దురదృష్టకరమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, యశోద సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని జీఎస్టీ అధికారులు తెలిపారు. తప్పు నమోదు లేదా సాంకేతిక లోపం కారణంగా ఈ గందరగోళం జరిగి ఉండొచ్చని, త్వరలోనే కేసును సమగ్రంగా పరిశీలించి ఖాతాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.