థాయ్‌లాండ్‌లో బుధవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భారీ క్రేన్ ఒక్కసారిగా ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై కూలిపోవడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రశాంతంగా సాగాల్సిన ప్రయాణం క్షణాల్లోనే మృత్యుఘట్టంగా మారడంతో, ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ప్రమాదం బ్యాంకాక్‌కు ఈశాన్యంగా సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రచాసిమా ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో, బ్యాంకాక్ నుంచి ఉబాన్ రచాథాని ప్రావిన్స్‌కు వెళ్తున్న స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నెంబర్–21 రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో రైలులో మొత్తం 195 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ పనులు జరుగుతున్న హైస్పీడ్ రైల్వే లైన్ సమీపంలో రైలు వెళ్తుండగా, నియంత్రణ తప్పిన భారీ క్రేన్ నేరుగా రైలుపై కూలింది.
క్రేన్ ఢీకొట్టిన ధాటికి రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఢీకొన్న వెంటనే బోగీల్లో మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. హైడ్రాలిక్ కట్టర్లు, క్రేన్ల సహాయంతో బోగీలలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కొన్ని గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి.
ఈ ప్రమాదంలో 22 మంది మరణించారని, 30 మందికి పైగా గాయాలయ్యాయని నఖోన్ రచాసిమా ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ థాచాపోన్ చిన్నవాంగ్ అధికారికంగా ధ్రువీకరించారు. తొలుత మృతుల సంఖ్యపై భిన్నమైన సమాచారం వెలువడినప్పటికీ, చివరకు అధికారులు సంఖ్యను స్పష్టం చేశారు. ఈ క్రేన్‌ను థాయ్–చైనీస్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంపై థాయ్‌లాండ్ రవాణా శాఖ మంత్రి ఫిఫత్ రచాకిత్‌ప్రకార్న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఘటనకు గల కచ్చితమైన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్టేట్ రైల్వే ఆఫ్ థాయ్‌లాండ్ (SRT)ను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.