ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 68,542 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 22,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అదే రోజు హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.3.98 కోట్ల ఆదాయం లభించింది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు దర్శనం చేసుకోవడానికి 8 నుంచి 10 గంటల వరకు సమయం పట్టింది.
ఈ పరిస్థితుల్లో భక్తులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పాదరక్షల నిర్వహణ. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ ఆధునిక విధానాన్ని అమలు చేసింది. లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లు ఏర్పాటు చేసింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద ఈ కొత్త కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ప్రస్తుతం తిరుమలలోని పలు ప్రాంతాల్లో మొత్తం 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఈ విధానంలో భక్తులు తమ చెప్పులు లేదా చప్పళ్లను కౌంటర్ వద్ద ఇచ్చిన వెంటనే క్యూఆర్ కోడ్ ఉన్న స్లిప్ అందజేస్తారు.ఆ స్లిప్‌లో పాదరక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. దర్శనం పూర్తయ్యాక స్లిప్‌ను స్కాన్ చేస్తే పాదరక్షలు ఉన్న స్థానం వెంటనే తెలుస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందగలుగుతున్నారు.
ఈ కొత్త విధానం అమలుతో ప్రస్తుతం దాదాపు 99 శాతం మంది భక్తులు తమ పాదరక్షలను సురక్షితంగా తిరిగి పొందుతున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. గతంలో ఈ సమస్య కారణంగా చాలామంది భక్తులు చెప్పులు వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ భాగంగా అమలు చేస్తోంది.