ఆధార్ కార్డులో మార్పులా..! UIDAI నయా రూల్స్! లైఫ్‌లో ఒక్కసారే ఛాన్స్!

UIDAI New Rules: ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామా మరియు తెలుగు భాషాపరమైన అక్షరదోషాల సవరణ ప్రక్రియను యూఐడీఏఐ మరింత సులభతరం చేసింది. సాధారణ మార్పులకు ఏదైనా గుర్తింపు పత్రంతో రూ. 75 చెల్లిస్తే సరిపోతుంది. వివాహం, విడాకుల తర్వాత మహిళలు ఇంటిపేరు మార్చుకోవడానికి అనెక్షర్-డీ, మైనర్ల కోసం అనెక్షర్-సీ అఫిడవిట్లు సమర్పించాలి. పూర్తిగా పేరు మార్చడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. ప్రక్రియ పూర్తయిన వారం నుంచి నెల రోజుల్లో మొబైల్‌కు సందేశం రావడంతో పాటు సవరించిన కార్డు తపాలా ద్వారా ఇంటికే చేరుతుంది.

ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణ ఇకపై మరింత సులభం
ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణ ఇకపై మరింత సులభం
  • మైనర్ల డేటా తప్పుల సవరణకు ప్రత్యేక వెసులుబాటు, అనెక్జర్-సీ సమర్పిస్తే సరిపోతుందన్న యూఐడీఏఐ!

  • ఇంగ్లీష్‌లో సరిగ్గా ఉండి తెలుగులో తప్పుగా పడిందా?.. సరైన గుర్తింపు పత్రాలతో సరిచేసుకునే చాన్స్!

  • పూర్తిగా పేరు మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి, జీవితంలో ఒక్కసారే అవకాశం!

Technology: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI - ఉడాయ్) ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో దొర్లిన అక్షరదోషాలు, భాషాపరమైన తప్పులను సులభంగా సరిచేసుకునేందుకు నూతన నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులోని చిన్నపాటి స్పెల్లింగ్ పొరపాట్లు, వివరాల మార్పుల కోసం గతంలో ప్రజలు సేవా కేంద్రాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు, సామాన్యులకు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవరణలు చేసుకునేలా ఆధార్ నిబంధనలను మరింత సరళతరం చేసింది.

చిన్నపాటి మార్పులకు గుర్తింపు కార్డులు – రూ. 75 ఫీజుతో ప్రక్రియ

నూతన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు పేరులోని అక్షరాల సంక్షిప్త రూపం (ఇనీషియల్స్) మార్చడం, ఇంటిపేరును పూర్తి పేరుగా రాయడం లేదా మధ్య పేరును సరిదిద్దడం వంటి సాధారణ మార్పుల కోసం సంబంధిత గుర్తింపు పత్రాన్ని (Proof of Identity) సమర్పిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 'కుబీ రాజు' అనే పేరును 'కొండవీటి భాస్కర్ రాజు'గా మార్చుకోవడానికి చెల్లుబాటు అయ్యే ఆధారం ఉంటే సరిపోతుంది. ఇందుకు సేవా కేంద్రంలో నిర్దేశిత ఫీజు రూ. 75 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

వివాహం లేదా విడాకుల సమయంలో ఇంటిపేరు మార్పు

మహిళలకు సంబంధించిన వివాహం లేదా విడాకుల సందర్భాల్లో ఇంటిపేరు మార్పులు అత్యవసరమవుతాయి. ఇటువంటి సమయాల్లో సంబంధిత గుర్తింపు కార్డుతో పాటు అధికారికంగా నిర్దేశించిన ‘అనెక్షర్-డీ’ (Annexure-D) అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి మూల గుర్తింపులో ఎటువంటి మార్పు లేకుండా, కేవలం వైవాహిక స్థితి మార్పుల వల్ల మాత్రమే ఇంటిపేరు మారుతోందని ఈ అఫిడవిట్ ద్వారా ధ్రువీకరిస్తారు. అలాగే మైనర్ పిల్లల ఆధార్ వివరాల్లో తప్పులు సరిచేయడానికి ‘అనెక్షర్-సీ’ (Annexure-C) మైనర్ అఫిడవిట్ సమర్పించాలని ఉడాయ్ స్పష్టం చేసింది.

తెలుగు భాషా దోషాల సవరణకు సులభ మార్గం

ఆధార్ కార్డుల్లో వ్యక్తిగత సమాచారం ఇంగ్లీష్‌తో పాటు స్థానిక ప్రాంతీయ భాష అయిన తెలుగులోనూ ముద్రితమవుతుంది. అయితే చాలా సందర్భాల్లో ఇంగ్లీష్‌లో పేరు సరిగ్గానే నమోదైనప్పటికీ, తెలుగు లిపిలోకి మార్చే సమయంలో అక్షరదోషాలు, ఒత్తులు తప్పుగా పడుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ ఆధారిత గుర్తింపు పత్రంతో పాటు సంబంధిత డిక్లరేషన్/అఫిడవిట్ సమర్పిస్తే, అధికారులు పరిశీలించి తెలుగులోని దోషాలను వెంటనే సరిదిద్దుతారు.

పూర్తిగా పేరు మార్చాలంటే గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి

ఆధార్ కార్డులోని వ్యక్తి పేరును పూర్తిగా మార్చి సరికొత్త పేరును పెట్టుకోవాలనుకుంటే (మేజర్ నేమ్ ఛేంజ్) మాత్రం సాధారణ ధ్రువీకరణ పత్రాలు చెల్లవు. దీని కోసం సదరు వ్యక్తి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సమర్పించాల్సి ఉంటుంది. గెజిట్ ప్రచురణ ఆధారంగా మాత్రమే పూర్తి పేరు మార్పును ఆమోదిస్తారు. ఈ రకమైన పూర్తి పేరు మార్పు జీవితకాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే చేసుకునేందుకు వీలుంటుందని నిబంధనలలో స్పష్టం చేశారు.

వారం నుంచి నెల రోజుల్లో ఇంటికే కొత్త కార్డు రాక

ఆధార్ సేవా కేంద్రంలో అవసరమైన పత్రాలను సమర్పించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రసీదు అందుతుంది. వివరాలు విజయవంతంగా అప్‌డేట్ అయినట్లుగా వారం నుంచి నెల రోజుల వ్యవధిలో దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అధికారిక ఎస్సెమ్మెస్ (SMS) సందేశం వస్తుంది. అనంతరం అన్ని సవరణలు పూర్తయిన ఒరిజినల్ కార్డు తపాలా శాఖ ద్వారా దరఖాస్తుదారుడి ఇంటి చిరునామాకే నేరుగా పోస్టులో చేరుతుంది.

Tags

Be the first to react

Latest