ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రింగ్ రోడ్డు విస్తరణ (Ring Road Expansion) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇటీవలే ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడంతో పనులు అధికారికంగా మొదలయ్యాయి.
వాహనదారుల ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యంగా అనకాపల్లిలో ఇప్పటికే పలుచోట్ల రహదారులు, వీధులను విస్తరించారు. పెరుగుబజారు ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు పూర్తయ్యి ప్రస్తుతం వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రద్దీ ఎక్కువగా ఉండే చింతావారివీధి, నాయిళ్ల వీధి విస్తరణ పనులు కూడా పూర్తి చేసి ట్రాఫిక్ భారాన్ని తగ్గించారు.
తాజాగా చేపట్టిన రింగ్ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం రూ.1.35 కోట్ల నిధులు కేటాయించింది. రైల్వే స్టేషన్ మీదుగా మార్కెట్ యార్డు వరకు రహదారిని విస్తరించడంతో పాటు, కాలిబాటలు మరియు కాలువల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఈ పనుల వల్ల వాహనాలు, పాదచారులకు మరింత సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కలగనుంది.
అనకాపల్లి (Anakapalli) లో గవరపాలెం ప్రాంతంలో ఉన్న నూకాలమ్మ ఆలయానికి భక్తుల రాకపోకలు అధికంగా ఉంటాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, నూకాలమ్మ ఆలయానికి చేరుకునేలా నాలుగు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది.
ఈ అన్ని పనులు నిర్ణీత కాలంలో పూర్తయితే అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో జాతీయ రహదారి ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధి కూడా కొనసాగుతోంది. పీపీపీ మోడల్‌లో రహదారుల నిర్మాణంతో ఏపీలో రవాణా మౌలిక వసతులు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.