నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి మాత్రమే చెందినది కాదని, ప్రజల జీవన విధానంగా మారాలని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛత అనేది రోడ్లు, కాలువల వరకే పరిమితం కాకుండా మన ఆలోచనలు, ప్రవర్తనలో కూడా కనిపించాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాదని, అందుకే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రను ఒక ఉద్యమంగా ఏడాది క్రితమే ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా దివంగత ముద్దుకృష్ణమనాయుడు సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. చివరి శ్వాస వరకు ప్రజాసేవలో కొనసాగిన ఆయన అందరికీ ఆదర్శమని చెప్పారు. ముద్దుకృష్ణమనాయుడి స్ఫూర్తితో భాను మరింత మెరుగ్గా పనిచేయాలని ఆకాంక్షించారు. భాను సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
స్వచ్ఛాంధ్ర అనేది ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన జీవనశైలిలో భాగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అలాగే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలన్నారు. చెడు ఆలోచనలతో రాజకీయాలు చేస్తే సమాజం ఏ దిశకు వెళ్తుందో గతంలో చూసిన విషయాలను గుర్తు చేశారు. భవిష్యత్తు బాగుండాలంటే మంచి ఆలోచనలు, మంచి నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా తీసుకువచ్చారని, తనను ఆ కార్యక్రమానికి ఛైర్మన్‌గా నియమించినప్పుడు స్పష్టమైన విధివిధానాలు రూపొందించామని చెప్పారు. ఐదేళ్లలో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ రాష్ట్రంగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మార్చి నెలలోపు కోటి 12 లక్షల టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు విశాఖపట్నం, గుంటూరులో ప్రారంభమయ్యాయని, కర్నూలు, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరులో కూడా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రాన్ని ఇప్పటికే ఓడీఎఫ్‌గా మార్చామని, ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్న ప్రాంతాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత అలవాటు చేయాలని, అందుకే అంగన్వాడీల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. నగరాల పరిశుభ్రత కోసం 71 భారీ స్వీపింగ్ మిషన్లు తెస్తున్నామని, నాలుగేళ్లలో 26 వేల కిలోమీటర్ల మేర ఆధునిక డ్రెయిన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
వ్యవసాయం, పర్యావరణం అంశాలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. 20 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా తయారీ ద్వారా ఎగుమతుల స్థాయికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని, మాట్లాడటానికి కూడా ప్రజలు భయపడే స్థితి ఏర్పడిందని విమర్శించారు. తాను సహా అనేక మంది అన్యాయంగా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మోదీ సహకారంతో తాను, పవన్ కళ్యాణ్ కలిసి ఆలోచించి కూటమిగా ముందుకు వెళ్లామని, ప్రజలు ఆశీర్వదించి ఘన విజయం అందించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, సుపరిపాలనతోనే ఇది సాధ్యమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. మంచి పాలన ఉంటే ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులు వస్తాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు.