భవిష్యత్తుపై దృష్టి పెట్టండి… విద్యార్థులకు హోంమంత్రి అనిత కీలక సూచనలు
చదువే లక్ష్యం కావాలి.. విద్యార్థులతో హోంమంత్రి అనిత సంభాషణ
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆమె తేగాడ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. పాఠశాలలో క్రీడా మైదానం అవసరమని విద్యార్థులు కోరగా, త్వరలోనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. అనంతరం తేగాడలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. గ్రామ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, సమాజం వారి కృషిని గౌరవించాలన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాలికల విద్య, భద్రత, స్వావలంబనపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో హోంమంత్రి అనిత, కలెక్టర్ విజయ్‌కృష్ణన్ కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచితే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందుతుందన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. చిన్న పొరపాట్ల వల్ల విలువైన జీవితాలను నాశనం చేసుకోకూడదని, ప్రతి పిల్లవాడికి చట్టాలపై అవగాహన ఉండాలని తెలిపారు.
మంచి మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి కృషి చేయాలన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తేగాడ మోడల్ స్కూల్‌ను ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.