సింగరేణి సంస్థపై జరుగుతున్న ప్రచారాలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రాణంలాంటి సింగరేణి కోల్ మైన్స్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలని కట్టుకథలు అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క, రోజుకో కొత్త కథనంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కథనాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు.
సింగరేణి వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి కథనాలు సంస్థలో పనిచేస్తున్న వేలాది కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సింగరేణి ఎంతో కీలకమని, అలాంటి సంస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.
టెండర్ల విషయంలో కావాలని అపోహలు సృష్టిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. 2021లోనే సెంట్రల్ మైనింగ్ సంస్థ సైట్ విజిట్ తప్పనిసరి అని సూచించిందని గుర్తు చేశారు. టెండర్ డాక్యుమెంట్లు సిద్ధమైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదని, గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు పిలిచిందన్నారు. వాస్తవాలు పక్కన పెట్టి, తనపై నిందలు మోపేలా కథనాలు వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను రాజకీయాల్లోకి వ్యక్తిగత లాభాల కోసం రాలేదని, సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రజాసేవ చేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి పరిరక్షణ కోసం పోరాడానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన బొగ్గు వనరులపై ఏ గద్దనూ వాలనీయబోనని, సంస్థ ఆస్తులను కాపాడడమే తన బాధ్యత అని చెప్పారు.
సింగరేణికి సంబంధించిన టెండర్లపై అనుమానాలుంటే విచారణకు తాను సిద్ధమని భట్టి విక్రమార్క ప్రకటించారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ చేయడానికి ప్రభుత్వం వెనుకాడదన్నారు. రాజకీయ నాయకులు లేఖలు రాయాలనుకుంటే నేరుగా తనకే రాయాలని, అప్పుడు తానే విచారణకు ఆదేశిస్తానని వ్యాఖ్యానించారు. అనవసరంగా ఇతరులకు లేఖలు రాసి గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు.
మీడియా, సోషల్ మీడియా వేదికలపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. వాస్తవాలు ప్రజల ముందుకు రావాలంటే అవసరమైన డాక్యుమెంట్లు కూడా విడుదల చేస్తామని తెలిపారు. అడ్డగోలు ప్రచారం చేసే వారి అసలు ఉద్దేశాలు బయటపడాలని అన్నారు. సింగరేణి ప్రతిష్టను కాపాడటం మాత్రమే కాదు, నిజాలను ప్రజలకు తెలియజేయడం కూడా ప్రభుత్వ బాధ్యత అని భట్టి విక్రమార్క తెలిపారు.