రాష్ట్రంలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్..
శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ 24 గంటల్లో పూర్తి..
రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ వంటి ప్రక్రియలు 24 గంటల్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వాహన డీలర్లు టెంపరరీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత అధికారులు 24 గంటల్లోపు ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తు చేసుకునే వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
అంతేకాకుండా, నిర్ణీత గడువులోపు అధికారులు స్పందించకపోతే రిజిస్ట్రేషన్‌కు ఆటోమేటిక్‌గా ఆమోదం లభించే విధానాన్ని కూడా తీసుకురానున్నారు. దీని వల్ల వాహనదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా ఆమోదాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా మారుతుందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.