2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి..
ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేసి, అదే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సమావేశమైన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు భవితవ్యంపై అనేక సందేహాలు నెలకొన్నాయని, కానీ ఇప్పుడు వచ్చే ఏడాదిలోనే పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రికి వివరించి సహకారం కోరారని చెప్పారు.
మైనర్ ఇరిగేషన్ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు కూడా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో కాలువల బదులు పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా చేసే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
దేశాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రారంభించిన నదుల అనుసంధాన ఆలోచనను ప్రస్తుతం ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని, అదే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పోలవరం–నల్లమల సాగర్ ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. అలాగే గోదావరి–కావేరి నదుల అనుసంధానానికి కూడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని నదులు, జలాశయాలు, కాలువలు, చెరువులు వంటి సంప్రదాయ నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూగర్భ జలాలను కూడా నిల్వ వ్యవస్థగా ఉపయోగించాలన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ దెబ్బతిన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగిందని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ డ్యామ్‌కు 33 కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుపై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి వెల్లడించారు. నిర్వాసితుల పునరావాసం, భూసేకరణ, పరిహారాలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేస్తామని కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. రెండో దశ పనులకు సంబంధించిన భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరామని చెప్పారు.
ప్రతి ఏడాది గోదావరిలో సుమారు 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని వినియోగించుకునేందుకు పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టు కీలకమని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
తెలంగాణతో ఉన్న చిన్నపాటి నీటి సమస్యలను సానుకూల చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని మంత్రి నిమ్మల తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, భూసేకరణ లేదా పునరావాస పనుల్లో కర్ణాటక ముందుకు వెళ్లకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.