- కుమార్తెను బందీ చేశారని ఫిర్యాదు
- విస్తీర్ణంలో అధికారుల తప్పులు
- గత ప్రభుత్వ ఖజానాకు కన్నం
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (TDP Central Office) కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన 'ప్రజా వినతుల స్వీకరణ' కార్యక్రమం బాధితుల కన్నీటి గాథలకు సాక్ష్యంగా నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన బాధితులు తమకు జరిగిన అన్యాయాలను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి, ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్విలకు మొరపెట్టుకున్నారు. దొంగతనాలు, భూ ఆక్రమణలు, నిధుల దుర్వినియోగం కుటుంబ సభ్యుల వేధింపులపై అందిన వినతులు సంచలనం రేకెత్తించాయి.
ఖరీదైన చోరీ.. పోలీసుల వింత తీరు!
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పూర్ణచంద్రరావు తన గోడును వెళ్లబోస్తూ.. 2021 అక్టోబర్ 20న తన ఇంట్లో సుమారు 818 గ్రాముల బంగారం, 15.5 కేజీల వెండి చోరీకి గురైనట్లు తెలిపారు. అప్పట్లో పోలీసులు దొంగలను పట్టుకుని సొత్తు రికవరీ చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో 500 గ్రాముల బంగారం, 30 కేజీల వెండిని తిరిగి ముద్దాయిలకే అప్పగించారని ఆరోపించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదులోనూ తీవ్ర జాప్యం జరిగిందని, గత ప్రభుత్వ పెద్దల అనుచరుల జోక్యంతో తనకు తీరని అన్యాయం జరిగిందని వాపోయారు.
ఉద్యోగం ఆశ చూపి కుమార్తెను బందీ చేశారు
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుమార్తె ఆచూకీ కోసం కన్నీటి పర్యంతమైంది. 30 ఏళ్లుగా తిరుమలలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూ కుమార్తెను చదివించానని అయితే కొందరు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తన బిడ్డను తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఆమెను తమ వద్దే ఉంచుకుని, తనపైనే నిందలు వేసేలా ఒత్తిడి తెస్తున్నారని, భౌతికంగా హింసిస్తూ ఆమె భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్నారని విలపించారు.
ఆస్తి కోసం కన్న బిడ్డలే కసాయిలుగా..
సత్యసాయి జిల్లాకు చెందిన వృద్ధుడు వెంకటేశులు ఆవేదన వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి... తన తదనంతరం తనను కనిపెట్టుకుని ఉంటుందని నమ్మి ఆస్తులను కుమార్తె పేరిట రాసిస్తే, ఆస్తులు చేతికందగానే అల్లుడు, కుమార్తె కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఆస్తులు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆ దాన పత్రాలను రద్దు చేయాలని ఆయన కోరారు.
రికార్డుల్లో గందరగోళం.. నిధుల గోల్ మాల్
భూ రికార్డుల గందరగోళంపై ప్రకాశం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు వినతి ఇచ్చారు. 3 ఎకరాల భూమిని రికార్డుల్లో అడుగుల లెక్కన నమోదు చేయడం వల్ల బ్యాంకు రుణాలు కూడా లభించడం లేదని వాపోయారు. మరోవైపు ఏలూరు జిల్లా కాగుపాడులో మాజీ సర్పంచ్ హయాంలో జరిగిన రూ. 15.54 లక్షల నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు నిధులు రికవరీ చేయకుండానే సదరు సర్పంచ్ కి అధికారులు మళ్లీ 'చెక్ పవర్' కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రవిశంకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
వీటితో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు అందజేయగా, అనారోగ్యంతో ఉన్నవారు వైద్య సాయం కోసం అభ్యర్థించారు. స్పందించిన టీడీపీ నేతలు, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.