అసెంబ్లీ హౌస్‌లో హాట్ …
వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కౌంటర్ అటాక్…
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై వ్యంగ్యంగా సంధించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైకాపా సభ్యులు ప్రదర్శించిన నిరసన సభ నుంచి వారు నిష్క్రమించిన తీరును ఉద్దేశించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా అంకెలతో కూడిన ఒక విచిత్రమైన పోలికను తెరపైకి తెచ్చారు. ఈరోజు 11వ తేదీ.. సభకు వచ్చింది 11 మంది.. వారు సభలో గడిపింది కేవలం 11 నిమిషాలు మాత్రమే! అంటూ ఆయన చలోక్తులు విసిరారు. 11వ తేదీన 11 మంది సభ్యులు వచ్చి కేవలం 11 నిమిషాల పాటు ఉండి వెళ్లిపోవడం ఒక విచిత్రమైన యాదృచ్ఛికమని వ్యాఖ్యానించారు. అంతకుమించి వారు సభలో ఉండలేకపోయారని కేవలం నిరసన తెలపడానికే పరిమితమయ్యారని అభిప్రాయపడ్డారు.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైకాపా సభ్యులు సభకు హాజరయ్యారు. అయితే వారు సభా కార్యక్రమాల్లో పాల్గొనడం కంటే, నిరసన గళం వినిపించడానికే ప్రాధాన్యతనిచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాసేపు సభలో హడావుడి చేసిన వైకాపా సభ్యులు ఆ తర్వాత కొద్దిసేపటికే సభను వీడి బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాన్ని గమనించిన స్పీకర్, వారు సభలో ఎంత తక్కువ సమయం ఉన్నారో వివరించడానికి ఈ '11' అంకెను ప్రాతిపదికగా తీసుకున్నారు.
సభాపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి అయ్యన్నపాత్రుడు సభా నిబంధనల విషయంలో కఠినంగా ఉంటూనే, అప్పుడప్పుడు ఇలాంటి సరదా వ్యాఖ్యలతో వాతావరణాన్ని తేలికపరుస్తుంటారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అత్యున్నత వేదికపై, సభ్యులు కేవలం నిరసనలకే పరిమితం కావడం సరికాదనే అంతరార్థం ఆయన మాటల్లో ధ్వనించింది. ప్రతిపక్షం సభలో ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ, వారు మాత్రం కేవలం నామమాత్రపు హాజరుతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టైం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు" అనే పదబంధం రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకుంటోంది..