జనవరి 26న దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలతో ఉత్సాహంగా మారింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం భారత గౌరవం, స్వాభిమానం ప్రతిబింబించే జాతీయ పండుగ అని పేర్కొంటూ, ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి పౌరుడు కట్టుబాటుతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన సందేశంలో ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ అభివాదాలు తెలియజేశారు. ఈ పండుగ దేశంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి సంకల్పాన్ని మరింత బలపరచాలని ఆయన ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం రాజ్యాంగ ఆధారంగా ముందుకు సాగుతున్న ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని ఈ రోజు గుర్తు చేస్తుందని అన్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద ఘనమైన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు. ఈ ఏడాది ప్రత్యేక అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కర్తవ్యపథ్‌ను ఆకర్షణీయంగా అలంకరించారు.
వేడుకలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి. అంతకుముందు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకానికి వెళ్లి అమర వీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి, ఇతర ప్రముఖులతో కలిసి గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షిస్తారు. సంప్రదాయం ప్రకారం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపిస్తారు. స్వదేశీగా తయారైన 105 ఎంఎం తుపాకులతో 21 గన్ సెల్యూట్ నిర్వహించనున్నారు.
ఈ ఏడాది పరేడ్‌లో మొత్తం 30 శకటాలు ప్రదర్శించనున్నారు. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 17, వివిధ కేంద్ర శాఖల నుంచి 13 శకటాలు ఉంటాయి. ‘స్వాతంత్ర్య మంత్రం, వందే మాతరం’ మరియు ‘సమృద్ధి మంత్రం, ఆత్మనిర్భర్ భారత్’ అనే అంశాలపై శకటాలు రూపొందించారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశ సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ప్రయాణం, సైనిక శక్తి, ప్రజల భాగస్వామ్యం ఈ శకటాల ద్వారా ప్రతిబింబించనుంది.