ఉత్తర అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిందని చెప్పుకోవాలి. పొరుగు దేశమైన కెనడా, చైనాతో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు ఇది కంటిలో నలుసు మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ కెనడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, ఆ దేశం నుండి వచ్చే దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆదివారం హెచ్చరించారు.
ఇటీవల కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ బీజింగ్‌లో పర్యటించి, చైనాతో ఒక ప్రాథమిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కెనడా నుండి చైనాకు వెళ్లే కానోలా (Canola) దిగుమతులపై సుంకాన్ని 84 శాతం నుండి 15 శాతానికి తగ్గించడానికి చైనా అంగీకరించింది. బదులుగా, కెనడా దాదాపు 49,000 చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) దిగుమతికి కేవలం 6.1 శాతం రాయితీ సుంకంతో అనుమతిని ఇచ్చింది.
అంతేకాకుండా కెనడా పర్యాటకులకు చైనా వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చైనా నెమ్మదిగా కెనడాను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఇది చాలా బాధాకరం అంటూ తన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
బ్యాక్ డోర్ ఎంట్రీపై నిఘా అమెరికా ప్రధాన అభ్యంతరం ఏమిటంటే, కెనడా ద్వారా చైనా వస్తువులు తక్కువ సుంకంతో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయనే భయం. చైనా తన చౌకబారు వస్తువులను అమెరికాలోకి పంపడానికి కెనడాను ఒక ద్వారంగా మార్చుకోవడాన్ని మేము అంగీకరించం అని ట్రెజరీ సెక్రటరీ బెస్సెంట్ స్పష్టం చేశారు. కెనడా గనుక చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (Free Trade Deal) ఖరారు చేస్తే, తక్షణమే 100% టారిఫ్ అమలులోకి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఒకవేళ అమెరికా 100% సుంకాలు విధిస్తే, కెనడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఎందుకంటే కెనడా ఎగుమతుల్లో మెజారిటీ భాగం అమెరికాకే వెళ్తాయి. ప్రస్తుతం నడుస్తున్న 'ట్రేడ్ వార్' కారణంగా ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు చైనా ప్రవేశంతో ఈ సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారింది.
ఈ అంతర్జాతీయ పరిణామాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా, భౌగోళిక రాజకీయాల (Geopolitics) సమీకరణాలను కూడా మార్చేలా కనిపిస్తున్నాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ హెచ్చరికలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.