టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎంపీలు తప్పనిసరి..
పెండింగ్ సమస్యలపై ఫుల్ ప్రిపరేషన్.. ఎంపీల పనితీరుపై లోకేశ్ ఫోకస్..
టీడీపీ ఎంపీలకు లోకేశ్ కీలక సూచనలు..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు – కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలన్న లక్ష్యంతో ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. సంబంధిత శాఖ మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా అక్కడే ఉండాలని సూచించారు. ఈ విధానం ద్వారా నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, పెండింగ్ అంశాలపై స్పష్టత సాధించడం సులభమవుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో నారా లోకేశ్ నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, కేంద్రంతో సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు కలిసి పాల్గొనాలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సమిష్టిగా పరిష్కార మార్గాలు రూపొందించాలని లోకేశ్ సూచించారు. శాఖాపరమైన అంశాల్లో మంత్రులు – ఎంపీలు పరస్పరం చర్చించుకోవడం ద్వారా కేంద్రంపై ప్రభావవంతమైన విధంగా రాష్ట్ర అవసరాలను ముందుకు తీసుకెళ్లవచ్చని ఆయన వివరించారు.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు సెషన్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో, మొదటి సెషన్ ముగిసిన అనంతరం వచ్చే విరామ సమయంలో ప్రతి ఎంపీతో వ్యక్తిగతంగా సమావేశమై కీలక అంశాలపై సమీక్షించనున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యలపై ఎంపీలు పూర్తి అవగాహనతో ఉండాలని, తాజా సమాచారంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, అనుమతుల అంశాల్లో ఎంపీలు చురుగ్గా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో ఎంపీల అనుసంధానం మరింత బలపడాలని లోకేశ్ కోరారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు సానుకూలంగానే ఉన్నప్పటికీ, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూనే, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, కార్యకర్తల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారికి సంతృప్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ – ప్రభుత్వం – కేంద్రం మధ్య సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని, ఈ బాధ్యతలో ఎంపీల పాత్ర అత్యంత కీలకమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.