ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7,000 చొప్పున జమ చేసింది. అయితే ఎన్నికల నియమావళి, ఈ-కేవైసీ లోపాలు, ఎన్‌పీసీఐ సమస్యలు వంటి కారణాలతో కొంతమంది ఖాతాల్లో నిధులు చేరలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించగా, ఆగస్టు 3 నుంచి 8 వరకు మొత్తం 10,915 మంది రైతులు దరఖాస్తు చేశారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాకు అత్యధికంగా 1,290 దరఖాస్తులు, విజయనగరం జిల్లాకు 1,111 దరఖాస్తులు వచ్చాయి. మిగతా 24 జిల్లాల నుండి వెయ్యి లోపు దరఖాస్తులే వచ్చాయి.
సేకరించిన దరఖాస్తులలో 5,377 దరఖాస్తులు మండల వ్యవసాయ అధికారి స్థాయిలో ఆమోదం పొందగా, 4,261 దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. 29 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. తహసీల్దార్ పరిధిలో 411 దరఖాస్తులు ఆమోదం పొందగా, 827 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 10 దరఖాస్తులు తిరస్కరించారు. అర్హులైన రైతుల ఖాతాల్లో పెండింగ్ నిధులను త్వరలో జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సమస్యల వల్ల సుమారు లక్షమంది రైతులకు సాయం అందడంలో జాప్యం జరిగినట్టు వెల్లడించారు.
భూమి యజమాని మరణించి వారసులకు పాసుపుస్తకాలు ఇవ్వని సందర్భాలు, ఆధార్ అనుసంధాన లోపాలు, న్యాయపరమైన వివాదాల్లో ఉన్న భూములు, ఆక్వా సాగు లేదా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూములు ఈ పథకం నుంచి మినహాయించబడ్డాయి. అలాగే నెలకు రూ.20 వేలకుపైగా జీతం పొందే ఉద్యోగులు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, 10 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న వారు, మైనర్లు కూడా అర్హులు కారు. ఈ-కేవైసీ పూర్తి చేయని వారు, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సమస్యలు ఉన్న ఖాతాదారులు బ్యాంకులో వివరాలు సరిచేసుకోవాలి. అర్హత గల ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ సాయం తప్పక అందుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.