మంగళగిరి తాడేపల్లి మేయర్ సీటు వారికే ఎందుకు? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Mangalagiri Mayor Reservation: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటు ఎస్టీకి కేటాయించడం వెనుక రాజ్యాంగబద్ధమైన రొటేషన్ ఫార్ములా ఉంది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో ఒకదాన్ని ఎస్టీకి ఇవ్వాల్సి ఉండగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 4.69% ఉన్న నెల్లూరుకు 2021లో దక్కింది. ఆ తర్వాత 3.38%తో రెండో స్థానంలో ఉన్న మంగళగిరి-తాడేపల్లికి తాజా రొటేషన్ క్రమంలో ఎస్టీ రిజర్వేషన్ వర్తించింది. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యానికి అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
2021లో నెల్లూరు (4.69% ఎస్టీలు).. ఇప్పుడు మంగళగిరి (3.38% ఎస్టీలు).. క్రమ సంఖ్య ప్రకారమే కేటాయింపు!
రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో నెల్లూరు తర్వాత అత్యధిక ఎస్టీలు మంగళగిరిలోనే.. అసలు వాస్తవాలివే!
రిజర్వేషన్లలో రాజకీయ జోక్యానికి తావులేదు.. నిబంధనలు మార్చితే కోర్టుల్లో అభ్యంతరాలు గ్యారెంటీ!
Mangalagiri: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (MTMC) మేయర్ పీఠాన్ని ఎన్నికల సంఘం ఎస్టీ (ST) కేటగిరీకి కేటాయించడంతో స్థానికంగా తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. ఆ ప్రాంతంలో గిరిజన జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎస్టీకి ఎలా రిజర్వ్ చేశారనే దానిపై పలు పార్టీలు, నాయకులు రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. అంతర్గత విభేదాల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేశారని కొందరు, బలమైన ప్రత్యర్థులను తట్టుకోలేకే రిజర్వేషన్ను మార్పించారని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజ్యాంగబద్ధమైన వర్టికల్ రిజర్వేషన్ల ఫార్ములా
అయితే వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నిర్ణయం కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం చేపట్టే సాంకేతిక ప్రక్రియ. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 'వర్టికల్ పద్ధతి'లో రొటేషన్ బేసిస్పై అమలు చేసేందుకు ఒక పక్కా ఫార్ములాను పాటిస్తారు.
2011 జనాభా లెక్కలే ప్రామాణికం – నెల్లూరు నేపథ్యం
ఈ రిజర్వేషన్ల నిర్ణయానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ఎస్టీ జనాభా శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటి ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ కావాల్సి ఉంటుంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 5,91,628 ఓటర్లలో 27,726 మంది (4.69%) ఎస్టీలు ఉండటంతో.. అత్యధిక శాతం ఉన్న కారణంగా మొదటి ప్రాధాన్యతగా నెల్లూరు మేయర్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది.
రొటేషన్ పద్ధతిలో మంగళగిరి నంబర్ – తాజా లెక్కలు
నెల్లూరు తర్వాత రొటేషన్ క్రమంలో అత్యధిక ఎస్టీ జనాభా శాతం ఉన్న కార్పొరేషన్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2,53,831 మంది ఓటర్లు ఉండగా, వారిలో 8,577 మంది గిరిజనులు ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో ఎస్టీల శాతం 3.38% గా ఉంది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో నెల్లూరు తర్వాతి స్థానంలో అత్యధిక ఎస్టీ జనాభా ఉన్నది మంగళగిరిలోనే కావడంతో, రొటేషన్ సీక్వెన్స్ ప్రకారం 2026 ఎన్నికలకు ఈ సీటు ఎస్టీకి కేటాయించబడింది.
రాజకీయ లేదా ప్రభుత్వ జోక్యానికి తావులేదు
స్థానిక సంస్థల చట్టాల ప్రకారం రిజర్వేషన్ల రొటేషన్ జాబితా తయారీలో ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ తమ ఇష్టానుసారం మార్పులు చేయడానికి ఎలాంటి వెసులుబాటు ఉండదు. ఒకవేళ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి సీట్లను తారుమారు చేస్తే కోర్టులలో న్యాయపరమైన అభ్యంతరాలు ఎదురై ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం ఈ కేటాయింపులను అధికారికంగా ఖరారు చేసింది.
నిరాధార ప్రచారాలకు చెక్
గణాంకాలు, చట్టపరమైన విధివిధానాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ.. కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మంగళగిరి తాడేపల్లి మేయర్ పీఠం ఎస్టీకి రిజర్వ్ కావడం చట్టబద్ధమైన ప్రక్రియే తప్ప, ఏ ఒక్కరి మెప్పు కోసమో లేదా భయపడో తీసుకున్న నిర్ణయం కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Be the first to react
