నకిలీ డాక్యుమెంట్లతో పిత్రార్జిత భూమి కబ్జా..! 30 ఏళ్ల నాటి హోటల్‌పై పోలీసుల ఆంక్షలు!
TDP Grivence: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా వేదిక" కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గుంటూరులో 25 సంఘాల డ్వాక్రా మహిళల రూ. 16 లక్షల పొదుపు సొమ్ము కాజేసిన ఆర్పీపై ఫిర్యాదు, వైఎస్సార్ జిల్లాలో 4.22 ఎకరాల పిత్రార్జిత భూమి కబ్జా, అనంతపురంలో ఇంటి స్థలం దౌర్జన్యం, నకిలీ ప్రామిసరీ నోట్లతో రూ. 22.50 లక్షల మోసం, తిరుపతిలో కోడలు గెంటేసిన వృద్ధురాలి ఆవేదన, డోన్ హైవే హోటల్‌పై పోలీసుల ఆంక్షలు, శ్రీకాకుళంలో 35 సెంట్ల జీడి తోట డీ-పట్టా సమస్యలపై బాధితులు మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన ఛైర్మన్, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
చంద్రబాబు కేటాయించిన 35 సెంట్ల భూమికి నేటికీ రాని పట్టా.. జీడి రైతు నర్సింగరావు వినతి!
పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సమస్యలపై వెల్లువెత్తిన వినతులు.. ఉద్యోగాల కోసం యువత అర్జీలు!
బాధితుల వినతులపై తక్షణమే స్పందించిన బత్తుల తాతయ్య బాబు.. అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు!
Mangalagiri: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా వేదిక" గ్రీవెన్స్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితుల నుంచి భారీ సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. ప్రజలు ఎదుర్కొంటున్న భూకబ్జాలు, మోసాలు, కుటుంబ వివాదాలు, జీవనోపాధి సమస్యలను ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ శ్రీ బత్తుల తాతయ్య బాబు స్వయంగా పరిశీలించి స్వీకరించారు. ప్రతి అర్జీదారుడి సమస్యను కూలంకషంగా విన్న ఆయన, సంబంధిత జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ మరియు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడి తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రూ. 16 లక్షలకు పైగా డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా
గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్ హసీనా, కోనేటి సుభాషిణి ప్రజా వేదికలో అర్జీ సమర్పిస్తూ తమ ప్రాంతంలోని 25 డ్వాక్రా సంఘాలకు రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)గా వ్యవహరిస్తున్న షేక్ గౌసియా బేగంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘాల నుంచి ప్రతి నెలా వసూలు చేసిన పొదుపు సొమ్మును బ్యాంకుల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకుందని తెలిపారు. బిస్మిల్లా డ్వాక్రా గ్రూపునకు చెందిన రూ. 3,53,000 పొదుపు మొత్తాన్ని దారిమళ్లించడంతో పాటు, వ్యక్తిగత అవసరాల కోసం యూపీఐ, నగదు రూపంలో రూ. 2,80,000, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి మరో రూ. 10,00,000 అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎగవేసిందని వాపోయారు.
న్యాయం అడిగితే దాడికి యత్నం – అధికారుల అండదండలు
తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఆ మొత్తాన్ని కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీఓ) ఆదినారాయణకు ఇచ్చానని, ఆయన వద్దే తేల్చుకోవాలంటూ గౌసియా బేగం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని బాధితులు తెలిపారు. డబ్బుల కోసం ఆమె ఇంటికి వెళ్లగా.. భర్త అమిత్, తల్లి సిరాజున్నీసా బేగం, షేక్ రెహమాన్ కలిసి మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ కొట్టడానికి మీదకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతలు, సీఓ అండదండలతో పెద్ద ఎత్తున వడ్డీల ఆశ చూపి మరికొందరిని కూడా మోసం చేశారని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని తమ కష్టార్జితాన్ని ఇప్పించాలని వేడుకున్నారు.
నకిలీ పత్రాలతో 4.22 ఎకరాల పిత్రార్జిత భూమి కబ్జా
వైఎస్సార్ జిల్లా వీఎన్ పల్లె మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ తమ పిత్రార్జిత భూమి కబ్జాకు గురైందని గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. సర్వే నంబర్ 18/5లో తమకు పూర్వీకుల నుంచి వచ్చిన 5 ఎకరాల 48 సెంట్ల భూమి ఉండగా, అందులో ఏకంగా 4 ఎకరాల 22 సెంట్లను పాలెం శ్రీదేవి, భీం సునీల్ కుమార్ అనే వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్లో తమ పేర్ల మీద నమోదు చేయించుకున్నారని వివరించారు. ప్రస్తుతం తన పేరు మీద కేవలం 1.26 ఎకరాలు మాత్రమే మిగిలిందని, కలెక్టర్ కార్యాలయంలో ఎన్నిసార్లు విన్నవించినా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ పక్కింటి వ్యక్తి దౌర్జన్యం
అనంతపురానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజా వేదికలో వివరించారు. అన్ని అనుమతులు, సరైన డాక్యుమెంట్లు ఉండి నిర్మించుకుంటున్న ఇంటికి ప్లాస్టరింగ్ పనులు చేయనివ్వకుండా పక్కింటి నాగభూషణం అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడని తెలిపారు. ఇల్లు కడితే గోడలు కూల్చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేసినా అతడు వెనక్కి తగ్గడం లేదన్నారు. విచారణకు పిలిస్తే అనారోగ్య సాకులతో తప్పించుకుంటూ, గత అక్టోబర్ 2న తమపై నేరుగా భౌతిక దాడికి సైతం పాల్పడ్డాడని, తన ఇంటి స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
నకిలీ ప్రామిసరీ నోట్లు సృష్టించి రూ. 22.50 లక్షల దగా
గుంటూరు కూరగాయల మార్కెట్లో 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న కోనేటి కబ్బయ్య తనపై జరుగుతున్న దౌర్జన్యాలపై అర్జీ సమర్పించారు. చింతకాయల రామారావు, నాగమల్లేశ్వరి దంపతుల వద్ద రూ. 1,00,000 అప్పు తీసుకున్న సమయంలో సంతకం చేసిన ప్రామిసరీ నోటును అడ్డం పెట్టుకుని, రమేష్ అనే వ్యక్తితో కలిసి మరో రూ. 6 లక్షల విలువైన 2 నకిలీ నోట్లు సృష్టించారని ఆరోపించారు. 2022లో నాగమల్లేశ్వరికి రూ. 1.32 లక్షల విలువైన 3 సవర్ల బంగారు గాజులు ఇవ్వడంతో పాటు, తన భార్య ద్వారా విడతలవారీగా తీసుకున్న రూ. 22,50,000 నగదును తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని, గుర్తుతెలియని వ్యక్తులతో తమ కుటుంబ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని రక్షణ కల్పించాలని కోరారు.
సొంత ఇల్లున్నా రోడ్డున పడ్డ వృద్ధురాలి ఆవేదన
తిరుపతి జిల్లా పాకాల మండలం గుండ్లగుట్టపల్లికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ తన దీనస్థితిని వివరిస్తూ గ్రీవెన్స్‌లో కన్నీరుమున్నీరయ్యారు. 2006లో ప్రభుత్వం మంజూరు చేసిన 2.5 సెంట్ల స్థలంలో రెక్కల కష్టంతో ఇల్లు కట్టుకుని, క్రమం తప్పకుండా పన్నులు, కరెంట్ బిల్లులు చెల్లిస్తూ జీవిస్తున్నానని చెప్పారు. అయితే ఇటీవల పెద్ద కుమారుడు మరణించడంతో, పెద్ద కోడలు బంగారమ్మ, మనవళ్లు అశోక్, గోపి, చెంగల్రాయులు కలిసి తనపై దౌర్జన్యం చేసి ఇంట్లోంచి బలవంతంగా గెంటేశారని వాపోయారు. సొంత ఇల్లు ఉండి కూడా బంధువుల ఇళ్లలో తలదాచుకోవాల్సి వస్తోందని, గతంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
హైవే హోటల్‌పై పోలీసుల ఆంక్షలు – 35 కుటుంబాల ఉపాధికి విఘాతం
కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ పరిధిలోని NH-44 హైవే పక్కన 'న్యూ భారత్ హోటల్' నిర్వహిస్తున్న ఆర్. మాధవప్ప గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. గత 30 ఏళ్లుగా ఈ హోటల్ ద్వారా 30 నుంచి 35 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామని, సీసీ కెమెరాలు, ప్రైవేట్ సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే పోలీసులు ప్రతిరోజూ రాత్రి 11 గంటలకే వచ్చి హోటల్‌కు పరదాలు కట్టి బలవంతంగా మూసివేయిస్తున్నారని, దీనివల్ల వ్యాపారం దెబ్బతిని ఈఎంఐలు, కరెంట్ బిల్లులు చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరామని, రాత్రిపూట ప్రయాణికుల కోసం నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకునేలా అనుమతినివ్వాలని కోరారు.
నాడు చంద్రబాబు ఇచ్చిన భూమికి డీ-పట్టా కోసం రైతు ఎదురుచూపులు
శ్రీకాకుళం జిల్లా నర్సయ్యపేటకు చెందిన పేద రైతు మైలపల్లి నర్సింగరావు తనకు న్యాయం చేయాలని కోరారు. 2016లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పేదరికాన్ని గుర్తించి నర్సయ్యపేట ఎలిమెంటరీ స్కూల్ పక్కన కేటాయించిన 35 సెంట్ల ప్రభుత్వ భూమిలో తాము జీడి మొక్కలు నాటుకుని జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అయితే ఆ స్థలంపై పక్కనే ఉన్న జిరాయితీ రైతు కన్నుపడి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడని, అధికారులు సర్వే చేసినా ఇప్పటివరకు డీ-పట్టా చేతికి రాలేదని, తక్షణమే పట్టా మంజూరు చేసి ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలని కోరారు.
అర్జీల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు – అండగా ఉంటామని భరోసా
ఈ ప్రధాన సమస్యలతో పాటు పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పలు అర్జీలను బాధితులు అందజేశారు. అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు సమర్పించగా, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న పలువురు ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తులు చేసుకున్నారు. అర్జీలన్నింటినీ పరిశీలించిన ఏపీ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు, కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేదలను వేధించే భూకబ్జాదారులు, మోసగాళ్లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
Be the first to react