గుంటూరులో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సుమారుగా 70 ఏళ్ల పాటు ఈ వంతెన మీదుగా నగరవాసులు రాకపోకలు సాగించారు. అయితే నగరం విస్తరించడం. ట్రాఫిక్ రద్దీ కారణంగా పాత వంతెన స్థానంలో నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మించనున్నారు. రూ.98 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి కూల్చివేతలు ప్రారంభం కాగా..
స్థానికులు పాత వంతెనతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.దశాబ్దాల పాటు గుంటూరువాసులకు సేవలు అందించిన శంకర్ విలాస్ పాత బ్రిడ్జి చరిత్రలో కలిసిపోతోంది. శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను గుంటూరులో సుమారుగా 70 ఏళ్ల కిందట నిర్మించారు. 1958లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించారు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానిస్తూ ఉంటుందీ ఫ్లైఓవర్.
అయితే పెరుగుతున్న వాహనాల రాకపోకలు, గుంటూరు నగరం విస్తరణ కారణంగా శంకర్ విలాస్ వంతెనను కూల్చివేస్తున్నారు. దీని స్థానంలో.. రూ. 98 కోట్లతో కొత్తగా నాలుగు వరుసల ఆర్వోబీని నిర్మించనున్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ డిమాండ్ ఇటీవల సాకారమైంది. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో ఈ కల సాకరమైంది.
శంకర్ విలాస్ ఫ్లైఓవర్ విషయానికి వస్తే.. 1958లో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 50 ఏళ్ల అవసరాలను తీర్చేలా దీనిని నిర్మించారు. అయితే ఈ వంతెన సుమారుగా 67 ఏళ్లపాటు సేవలు అందించింది. దీనిపై నిత్యం 50 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. శంకర్ విలాస్ వంతెన నిర్మాణం తర్వాత పశ్చిమం వైపు గుంటూరు భారీగా విస్తరించింది.