చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతుపై పలు కీలక ప్రకటనలు చేశారు.
ప్రధానంగా, చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడే నేతన్నల ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వారికి 50 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది వారి భవిష్యత్‌ను బలోపేతం చేసేందుకు తీసుకున్న దశలవారీ చర్యలలో భాగమని సీఎం పేర్కొన్నారు.
అమరావతిలో భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక ఉపాధిని కల్పించే రంగం చేనేత రంగమేనని గుర్తు చేశారు.
ఈ రంగాన్ని బలోపేతం చేయడంలో తమ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. 55,500 మంది కార్మికులకు మొత్తం రూ.27 కోట్లు విలువైన రుణాలు మంజూరు చేయడమే కాక, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం అందించామని చెప్పారు.
ఇక మరమగ్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం, 50 శాతం సబ్సిడీతో రూ.80 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి దీన్ని 500 యూనిట్ల వరకు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ చర్యలతో 93 వేల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సవిత, పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.