భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) తన పేమెంట్ గేట్‌వే విభాగం ద్వారా ‘ఫోన్‌పే పీజీ బోల్ట్ (PhonePe PG Bolt)’ అనే కొత్త ఫీచర్‌ను శనివారం అధికారికంగా ప్రారంభించింది. వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో చెల్లింపులు చేసే యూజర్ల కోసం ఈ సదుపాయం రూపొందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క క్లిక్‌తోనే వేగవంతమైన, అత్యంత సురక్షితమైన చెల్లింపులు పూర్తి చేయడం. తరచూ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సిన తలనొప్పికి ఇది పూర్తిగా చెక్ పెట్టనుంది.
ఈ ‘బోల్ట్’ ఫీచర్ డివైస్ టోకెనైజేషన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. యూజర్లు తమ వీసా లేదా మాస్టర్‌కార్డ్ వివరాలను ఫోన్‌పే యాప్‌లో ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అదే డివైస్‌లో ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే ఉన్న ఏ మర్చంట్ యాప్‌లోనైనా కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ వంటి వివరాలు మళ్లీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా తదుపరి లావాదేవీలకు సీవీవీ నంబర్ అడగకపోవడం యూజర్లకు పెద్ద రిలీఫ్‌గా మారనుంది. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సులభంగా, వేగంగా జరుగుతాయి.
సాధారణంగా ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో యూజర్లు ఒక యాప్ నుంచి మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంటారు. దీని వల్ల లావాదేవీలు మధ్యలో ఆగిపోవడం (డ్రాప్-అవుట్స్) ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ‘బోల్ట్’ ఫీచర్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. మొత్తం చెల్లింపు ప్రక్రియ మర్చంట్ యాప్‌లోనే పూర్తవుతుంది. యూజర్ అనుభవం మెరుగుపడటమే కాకుండా, వ్యాపారులకు కూడా లావాదేవీల సక్సెస్ రేటు పెరుగుతుందని ఫోన్‌పే తెలిపింది. ఈ ఫీచర్ ముఖ్యంగా ఈ–కామర్స్, ట్రావెల్, ఫుడ్ డెలివరీ, సబ్‌స్క్రిప్షన్ సేవలందించే సంస్థలకు మరింత ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ సందర్భంగా ఫోన్‌పే మర్చంట్ బిజినెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావట్ మాట్లాడుతూ.. “భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడమే మా లక్ష్యం. ‘బోల్ట్’ ఫీచర్ ద్వారా టోకెనైజేషన్ ఆధారిత వన్-క్లిక్ పేమెంట్ అనుభవాన్ని యూజర్లకు అందిస్తున్నాం. ఇది కేవలం యూజర్ సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, మా మర్చంట్ భాగస్వాముల వ్యాపార వృద్ధికి కూడా కీలకంగా మారుతుంది” అని తెలిపారు. ఫోన్‌పే తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్స్ విధానానికే కొత్త దిశ చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.