చిన్నారుల ప్రతిభతో మెరిసిన తానా ఆస్టిన్ వార్షికోత్సవం..
తెలుగు సంస్కృతికి అద్దం పట్టిన తానా పాఠశాల వేడుకలు..
ఆస్టిన్‌లో తానా పాఠశాల ఆరవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నారుల ప్రతిభ, తెలుగు భాష పట్ల వారి ఆసక్తి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో తానా పాఠశాల విద్యార్థులు కలిసి “బాల రామాయణం” నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ముఖ్యంగా పిల్లలు స్వయంగా తెలుగులో సంభాషిస్తూ రామాయణ పాత్రలను పోషించడం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వారి సహజ నటనకు హాజరైన వారంతా మంత్రముగ్ధులయ్యారు.
ఈ వేడుకకు గౌరవ అతిథిగా నగర మేయర్ జిమ్ హాజరై, పిల్లల ప్రతిభను కొనియాడారు. ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా విశ్వ గురుకులం “అంకురం” పాఠ్యపుస్తకాన్ని వ్యవస్థాపక సభ్యుడు రామ్ మారం విడుదల చేశారు. అనంతరం పాఠశాల మరియు విశ్వ గురుకులం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన నిహారిక భమిడిపాటి, రితిక గంగబత్తిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. మరోవైపు, పూర్వ విద్యార్థులైన ద్విజేష్ గొంట్ల, సమయ సిద్ధాంత పొట్లచెరువు ఈ సంవత్సరం విద్యార్థులకు బోధించడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న కో-చైర్ రజని మారం, ఉపాధ్యాయులు అనూష చిట్టూరి, ప్రతూష అట్లూరి, శ్వేత వెలగలేటి, రాజేష్ గంగబత్తిన, శ్రీదేవి కోట, మృదుల కొనంకి, వాసవి కల్వతో పాటు విశ్వ గురుకులం ఉపాధ్యాయులు వంశీ భరద్వాజ్ ని తానా చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్, తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి అభినందించారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీనివాస్ లావు, శ్రీనివాస్ ఒరుగంటి, రాజా కసుకుర్తి, ఠాగూర్ మల్లినేని గారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్షికోత్సవం పిల్లల్లో తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆసక్తిని మరింత పెంచిన వేడుకగా నిలిచింది.