దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం జరిగిన భయానక పేలుడుతో ఒక్కసారిగా కుదిపిపోయింది. ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతం చాందినీ చౌక్ వద్ద సాయంత్రం సమయంలో ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ ప్రాంతం జనసంచారంతో నిండివుండటంతో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. మంటలు చెలరేగి ఆకాశంలో అగ్నిగోళంలా ఎగసిపడటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.
పేలుడు తీవ్రతకు సమీపంలోని మూడు నుండి నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న కొన్ని షాపులు, భవనాలు కూడా నష్టపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 20 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రాత్రి 7:29 గంటల సమయానికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు పేలుడు పెద్ద శబ్దంతో సంభవించిందని, క్షణాల్లో మంటలు ఆకాశాన్ని తాకాయని చెప్పారు.
ఈ ఘటనతో భద్రతా వ్యవస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద చర్యల అనుమానంతో యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు చోటు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో, పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసి ఆధారాల సేకరణ ప్రారంభించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా అక్కడకు చేరుకుని మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని పరిశీలిస్తోంది.
ఢిల్లీ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. ముంబైలోని కీలక రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీలోని అన్ని జిల్లాలకూ ఉన్నతాధికారులు అప్రమత్తత ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలను పెంచి, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాలన్నింటినీ హై అలర్ట్‌లో ఉంచింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.