సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా నిలిపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ, అమరావతి ప్రాంతాల సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, పర్యాటక ఆకర్షణలను రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో “ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్”ను నిర్వహించనున్నారు. ఈ వేడుకలు కేవలం పండుగ ఆనందాలకే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను దేశవ్యాప్తంగా చాటే వేదికగా నిలవనున్నాయి.
రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా విజయవాడ నగరం సందడి చేయనుంది. ముఖ్యంగా పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ ప్రాంతాలు పండుగ కళతో కళకళలాడనున్నాయి. స్థానికులు మాత్రమే కాకుండా, పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయ ఆవకాయ్ పేరు మీదుగా ఈ ఫెస్టివల్‌కు నామకరణం చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఆంధ్రుల ఆహార సంస్కృతిలో ఆవకాయ్‌కు ఉన్న ప్రత్యేక స్థానాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమాలు రూపొందించారు.
ఈ ఫెస్టివల్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, స్థానిక కళాకారుల ప్రతిభా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆవకాయ్‌తో పాటు పలు రకాల ఊరగాయలు, గ్రామీణ వంటకాల రుచులను సందర్శకులు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. పిల్లలు, యువత, కుటుంబాల కోసం వినోదాత్మక కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫ్రీ పాస్‌లు అందించనున్నారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకుంటే, ఫెస్టివల్‌లో జరిగే ఈవెంట్ల వివరాలు, తేదీలు, సమయాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. పాస్‌ల వ్యవస్థను ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావడం వల్ల, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా నమోదు చేసుకునే అవకాశం కలిగింది.
ఈ ఫెస్టివల్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే, జనవరి 8వ తేదీన సాయంత్రం నుంచి రాత్రి వరకు పున్నమి ఘాట్‌లో ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే జనవరి 9, 10 తేదీల్లో ఉదయం వేళ భవానీ ఐలాండ్‌లో, సాయంత్రం వేళ పున్నమి ఘాట్‌లో కార్యక్రమాలు కొనసాగుతాయి. మూడు రోజుల పాటు నిరంతరంగా సాంస్కృతిక సందడి నెలకొననుంది. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.