నటసింహం నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో హీరోగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ఆయనకు ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ ప్రత్యేక మైలురాయిని చేరుకుని, ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. యాభై ఏళ్ల పాటు కథానాయకుడిగా నిలవడం భారతీయ సినిమాలలో అత్యంత అరుదైన ఘనతగా గుర్తించారు.
ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని ప్రశంసించింది. ఆయన సాధనకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించడం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం.
ఆగస్టు 30న హైదరాబాద్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో బాలకృష్ణకు అధికారికంగా పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ వార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.