ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులకు తొలి విడతలో రూ.7,000 సాయం అందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000, కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద రూ.2,000 ఇచ్చింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతులకు ఈ సాయం అందలేదు. అలాంటి రైతులకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా, ఆ గడువు ఆగస్ట్ 25వ తేదీతో (రేపటితో) ముగియనుంది.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాయం రాకపోవడానికి కారణాలుగా లబ్ధిదారుల మరణం, బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ చేయకపోవడం, ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉండటం, భూముల క్రయవిక్రయాలు, కట్నం లేదా బదలాయింపులు వంటి అంశాలను అధికారులు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే పెండింగ్‌లో ఉన్న రైతులకు కూడా ఈ సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, కేంద్ర పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం ఏటా రూ.20,000 సాయం రైతులకు అందిస్తోంది. ఇందులో కేంద్రం రూ.6,000, రాష్ట్రం రూ.14,000 కలిపి మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 4న తొలి విడతగా రూ.7,000ను 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.