శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వసతి సముదాయం, వేంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. టీటీడీ రూ.102 కోట్లతో నిర్మించిన ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ కాంప్లెక్స్-5, భక్తుల కోసం ఒకేసారి 4,000 మందికి ఉచిత వసతిని అందిస్తుంది. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటల వేడి/చల్లని నీటి సదుపాయం, కల్యాణ కట్ట కోసం ప్రత్యేక ప్రాంగణం, రెండు పెద్ద డైనింగ్ హాళ్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. భక్తులకు సౌకర్యవంతమైన వసతి, భోజన, తదితర సదుపాయాలను అందిస్తూ, ఇక్కడి వసతా వ్యవస్థకు ముందస్తు బుకింగ్ అవసరం లేదు.
వసతి సముదాయం ప్రారంభించిన తర్వాత, సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి భవనాన్ని పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్‌లోకి వెళ్లి, భక్తుల బుకింగ్ విధానాన్ని తెలుసుకున్నారు. ఒక భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్‌ను సీఎం అందజేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేస్ట్ కలెక్షన్ యంత్రాలను పరిశీలించి, శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే AI ఆధారిత సార్టింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ యంత్రాల సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రసాదం, నాణ్యతతో భక్తులకు అందజేయడం సాధ్యం అవుతుంది.
క్యూలైన్ నిర్వహణకు ఆధునిక టెక్నాలజీ పరిష్కారం: తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించడానికి, కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం గంటకు 4,500 మంది భక్తులు దర్శనం పొందుతున్నారు. AI, క్వాంటం రెడీ అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో భక్తుల క్యూలైన్, వేచివుండే సమయాన్ని తగ్గించే విధంగా పర్యవేక్షణ నిర్వహించబడుతోంది. భక్తులు గంటకు 5,500 వరకు దర్శనం పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యూలైన్ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వీడియోలు, శ్రీవారి చరిత్ర ప్రదర్శన ద్వారా భక్తి అనుభూతిని పెంపొందించాలన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అలిపిరి వద్ద భక్తులు తీసుకువచ్చే నిషేధిత వస్తువులను కూడా పర్యవేక్షణలో ఉంచనున్నారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీ హీట్ మ్యాప్‌లు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గిరి ప్రాంతాల్లో పరిశుభ్రత, ఆకర్షణీయమైన పరిసరాలను అందించడానికి, 90% పైగా హరిత ప్రాంతాల ఏర్పాటు చేయమని, చెత్త సమస్యలు వెంటనే తొలగించమని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.