అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థ, పాకిస్థాన్ సైనిక నిధులతో సంబంధం ఉన్న సంస్థ మధ్య రహస్య ఒప్పందం అంతర్జాతీయ దుమారం రేపింది. ‘డిస్ఇన్ఫో ల్యాబ్’ విడుదల చేసిన నివేదికలో ఈ ఒప్పందం మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల బదిలీ కోసం ఉపయోగపడే అవకాశం ఉందని ఆరోపించింది.
గత కొన్ని నెలలుగా అమెరికా–పాకిస్థాన్ సంబంధాలు అనూహ్యంగా మెరుగుపడటంలో ఈ క్రిప్టో ఒప్పందం కీలక పాత్ర పోషించిందని నివేదిక పేర్కొంది.
ఒకే వ్యక్తి, రెండు కీలక పదవులు
బిలాల్ బిన్ సాఖిబ్ అనే బ్రిటిష్-పాకిస్థానీ వ్యాపారవేత్త, ఒకే సమయంలో రెండు పదవులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్ (PCC) సీఈఓ, అలాగే ట్రంప్ కుటుంబానికి చెందిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ (WLFF) క్రిప్టో సంస్థకు సలహాదారుగా ఉన్నారు. ఈ WLFFలో ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, జారెడ్ కుష్నర్‌లకు కలిపి 40% వాటా ఉంది.
ఏప్రిల్ 26, 2025న పాకిస్థాన్–WLFF ఒప్పందం కుదిరింది. దీని కొద్ది రోజుల ముందే బిలాల్‌ను WLFF సలహాదారుగా నియమించారు, తర్వాత PCC సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. నివేదిక ప్రకారం, ఆయన పాకిస్థాన్ ప్రయోజనాలు మరియు ట్రంప్ కుటుంబ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బినాన్స్ వ్యవస్థాపకుడు పాత్ర
ఈ వ్యవహారంలో మరో వివాదాస్పద వ్యక్తి బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో. అమెరికాలో మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధుల బదిలీ కేసులో నాలుగు నెలల జైలు శిక్షకు గురయాడు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌కు వ్యూహాత్మక సలహాదారుగా నియమించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పాక్ సైన్యం పాత్రపై అనుమానాలు
బిలాల్‌కు సంబంధించిన కొన్ని కంపెనీలు వాస్తవ వెబ్‌సైట్లూ లేవు, ఆయన సోదరి మినాహిల్‌కు చెందిన కంపెనీ పాకిస్థాన్ సైనికులకు చెందిన ‘అల్ ముస్తఫా ట్రస్ట్’తో భాగస్వామ్యం కొనసాగిస్తోంది. ఈ ట్రస్ట్ స్లష్ ఫండ్గా పనిచేస్తోంది. ఈ ఒప్పందం తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనలు, కొత్త ఒప్పందాలు, చివరికి ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.