ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత జాతీయ రహదారితో కలిపే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మించబడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్‌కు వెళ్లే మార్గంలో కేఎల్‌రావు కాలనీ దగ్గర రూ.70 కోట్ల వ్యయంతో స్టీల్ వంతెన నిర్మాణ పనులు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ప్రారంభించింది. ఈ వంతెనను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెన పూర్తయితే, కృష్ణా కరకట్టపై ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వాహనాలు నేరుగా బ్రిడ్జి మీదుగా అమరావతికి చేరే వీలుంటుంది.
128 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ దగ్గర పిల్లర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే, అమరావతికి వెళ్లే వాహనాల రాకపోకలు వేగవంతమవుతాయి. కరకట్టపై తరచుగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. అదే విధంగా, అధికారులు ఇంకో వంతెన నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని ఉండవల్లి సెంటర్‌లోని కేఎల్‌రావు కాలనీతో కలపనుంది. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు నేషనల్ హైవేకు వెళ్లాలంటే చెన్నై-కోల్‌కతా రైలు మార్గం, డెల్టా కాలువ దాటాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండో వంతెన అవసరం ఏర్పడింది.
ఇక సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా వేగవంతమవుతున్నాయి. అమరావతిని ప్రకాశం బ్యారేజీతో కలిపే ఈ రోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇటీవల పెనుమాక, ఉండవల్లి రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం 12.40 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రోడ్డు పనులు మరింత ఊపందుకున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే, ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి నేరుగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా డెల్టా కాలువపై నిర్మాణం జరుగుతున్న కొత్త స్టీల్ బ్రిడ్జి ఈ రోడ్డుకు కీలక లింక్‌గా మారనుంది.
ఇక రాబోయే రోజుల్లో మరో 5.6 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూముల భూసేకరణ ప్రక్రియ పూర్తయితే, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మరింత వేగంగా సాగుతుంది. అధికారులు రైతులతో చర్చలు జరుపుతూ సమన్వయం సాధిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత, అమరావతికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రజలకు సౌకర్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అభివృద్ధికి ఈ వంతెనలు, రోడ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.