ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యలకు త్వరలో పరిష్కారం దొరకనుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా శుద్ధమైన మంచినీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ను మళ్లీ వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తూ వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్ (NaBFID) నుండి రూ.10 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తవగా, బ్యాంకు మూడు విడతల్లో లోన్‌ను విడుదల చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఈ రుణ ప్రతిపాదన టెక్నికల్ ఫీజిబిలిటీ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ నెలాఖరులో ఆమోదం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తాగునీటి కుళాయి కనెక్షన్ ప్రాజెక్టు డీపీఆర్ (Detailed Project Report) కు కేంద్ర ఆమోదం లభించిన తర్వాతే ఈ రుణం మంజూరు అవుతుంది. గతంలో బోరుబావుల ఆధారంగా నీటి సరఫరా జరిపినప్పుడు వేసవిలో భూగర్భజలాలు తగ్గడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇప్పుడు నదులు, జలాశయాల నుంచి నీరు సేకరించి శుద్ధి చేసి కుళాయిల ద్వారా ప్రజలకు అందించేలా కొత్త ప్రణాళికను రూపొందించింది. మొత్తం రూ.84,500 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే, NaBFID రుణం విడుదలకు మార్గం సుగమమవుతుంది.
జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం మొదట ఆమోదించిన రూ.27 వేల కోట్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్ర వాటా నిధులు సమయానికి కేటాయించకపోవడం, కేవలం రూ.4 వేల కోట్లకు మాత్రమే పనులు జరపడం వల్ల ప్రాజెక్టు నిలిచిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పెండింగ్ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. రూ.23 వేల కోట్ల విలువైన ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేసి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మొత్తం ప్రాజెక్టులో రాష్ట్రం రూ.10 వేల కోట్లను రుణంగా సమకూర్చుకోగా, మిగతా రూ.13 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నిధులతో 25 లక్షలకుపైగా ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, కర్నూలు, అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటి సమస్య ఉండదని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.