తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఇప్పటివరకు 15 మంది మృతులను గుర్తించారు.
మరణించిన వారిలో దస్తగిరి బాబా (డ్రైవర్), గుర్రాల అభిత (21) – యాలాల్, మల్లగండ్ల హనుమంతు – దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష – తాండూరు, తారిబాయ్ (45) – దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45) – బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55) – భానూరు, ఏమావత్ తాలీబామ్ – ధన్నారం తండా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతులు, మహిళలే కావడం విషాదాన్ని మరింత పెంచింది.
ప్రమాదం గురించి బస్సులో ప్రయాణించిన వినయ్ అనే వ్యక్తి భయానక వివరాలు వెల్లడించారు. “బస్సు పూర్తిగా నిండిపోయింది. కొందరు నిలబడి ప్రయాణిస్తున్నారు. మీర్జాగూడ దగ్గర ఎదురుగా వచ్చిన టిప్పర్ అతివేగంతో బస్సును ఢీకొట్టింది. టిప్పర్ మొదటి ఆరు సీట్ల వరకు లోపలికి చొచ్చుకొచ్చింది. ఆ సీట్లలో ఉన్న ప్రయాణికులు కంకర మరియు ఇనుపముక్కల మధ్య చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. నేను వెనుక సీటులో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాను” అని ఆయన తెలిపారు.
ప్రమాద స్థలానికి వెంటనే పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. క్రేన్‌ల సహాయంతో బస్సు, టిప్పర్ వాహనాలను విడదీసి చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. “క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి నిజమైన కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బాధితుల కుటుంబాలు తమ వారిని కోల్పోయి విలపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది.