భవిష్యత్తు సాంకేతికతకు కొత్త దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ సంస్థ CEO సత్య నాదెళ్ల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ఐటీ రంగంలో చర్చనీయాంశమయ్యాయి. “మైక్రోసాఫ్ట్ విస్తరణ ఇకపై స్మార్ట్ గా ఉంటుంది. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా అన్ని విభాగాలు పునర్నిర్మాణం చెందుతాయి. రాబోయే నియామకాలు కూడా ఈ మార్పును ప్రతిబింబిస్తాయి” అని ఆయన తెలిపారు.
సత్య నాదెళ్ల ప్రకారం, మైక్రోసాఫ్ట్ AI టెక్నాలజీని కేవలం ఒక సాధనంగా కాకుండా, భవిష్యత్తు వ్యూహాత్మక ఆస్తిగా మలుచుకుంటోంది. కంపెనీ ఇప్పటికే OpenAI, Copilot, Azure AI వంటి ప్రాజెక్టుల ద్వారా భారీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలును వేగవంతం చేసింది. “ఇకపై మా ప్రతి నియామకం కూడా ఏఐ ప్రభావాన్ని పెంచే దిశగా ఉంటుంది. మునుపటిలా యాంత్రికంగా ఉద్యోగులను నియమించడమో, విభాగాలను విస్తరించడమో జరగదు. ప్రతి నియామకం వ్యూహాత్మకంగా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో మైక్రోసాఫ్ట్ పలు దశల్లో 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, నాదెళ్ల చెబుతున్నదేమిటంటే, ఇది ఉద్యోగాల కోత కాదు పనితీరులో మార్పు. AI సాయంతో తక్కువ శ్రామిక శక్తితో ఎక్కువ ఉత్పాదకత సాధించడం మైక్రోసాఫ్ట్ కొత్త దిశ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
సత్య నాదెళ్ల మరింత స్పష్టంగా చెప్పారు: “ఇకపై మానవ మేధస్సు మరియు యాంత్రిక మేధస్సు కలయికే అసలు శక్తి. AI వల్ల ఉద్యోగాలు పోవడం కాదు, పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి ఉద్యోగి ‘AI-సమర్థుడు’ కావాలి. అదే భవిష్యత్తు లక్ష్యం.”
మైక్రోసాఫ్ట్ ఇటీవల Copilot 365, Azure AI Studio, GitHub Copilot X వంటి టూల్స్ ద్వారా ఉద్యోగుల పనిని మరింత సులభతరం చేసింది. ఉద్యోగులు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే కాకుండా, సృజనాత్మకతను పెంచుకునేలా కంపెనీ పనిచేస్తోందని నాదెళ్ల వివరించారు.
ఇకపోతే, టెక్ రంగం నిపుణులు కూడా ఈ దిశలో మైక్రోసాఫ్ట్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. వారు చెబుతున్నదేమిటంటే “AI ఆధారిత నియామకాలు” అంటే ఉద్యోగ కోత కాదు, ఉద్యోగ రూపాంతరం. మైక్రోసాఫ్ట్ తీసుకుంటున్న ఈ వ్యూహం భవిష్యత్తు పనితీరుకు గ్లోబల్ బ్లూప్రింట్‌గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.