రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సర్కార్ బడి టీచర్లకు సుప్రీంకోర్టు భారీ పరీక్ష పెట్టింది. టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత లేని ఉపాధ్యాయులంతా రెండు సంవత్సరాల లోపు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం టెట్–2025 (అక్టోబర్) నోటిఫికేషన్ విడుదల చేయగా, దానితో సంబంధించి “పరీక్ష రాయాలా? వద్దా?” అనే సందేహం ప్రతి టీచర్ మనసులో తలెత్తింది. టెట్ పరీక్ష సిలబస్, మార్కుల విధానం, నిబంధనలు చూసి చాలామంది సర్వీసులో ఉన్న టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల తరఫున టెట్ మినహాయింపుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. దీంతో మరోసారి టీచర్లలో ఆశలు చిగురించాయి. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు రాష్ట్రంలోని సర్కార్ బడి టీచర్ల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.8 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో పీఈటీలు, పీడీలు మినహాయింపు పొందగా, 2011కు ముందు డీఎస్సీ ద్వారా నియామకమైన మిగతా టీచర్లు టెట్ తప్పనిసరిగా రాయాల్సిందే. ఐదేళ్ల లోపు సేవలో ఉన్నవారికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చినప్పటికీ, భవిష్యత్తులో పదోన్నతి పొందాలంటే వారికి కూడా టెట్ అర్హత అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ఏపీకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పుపై పునరాలోచన చేయాలని నిర్ణయించాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించి ఉపాధ్యాయులకు తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ తుది నిర్ణయం సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.
ఏపీలో ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయులకు టెట్ రాయడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. దీంతో కొంతమంది టీచర్లు మినహాయింపుపై ఆశలు పెట్టుకోకుండా పరీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 53,560 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 5,916 మంది ప్రస్తుత సర్వీసు టీచర్లు ఉన్నారు. వీరంతా డిసెంబరు 10న జరగనున్న టెట్ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు జరుగుతుంది. అందులో ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీచర్లలో భయం, గందరగోళం, ఆతృత అన్నీ కలిసిపోయాయి. సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా వస్తుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది.