ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కొత్త పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని, వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పరిశ్రమలు నడిపే మహిళలకు, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు డీఆర్‌డీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్వయం సహాయక సంఘాల మహిళలు డెయిరీ, పచ్చళ్లు, కలంకారి, ఆహార శుద్ధి యూనిట్లు, ఫ్యాన్సీ షాపులు వంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు. మార్కెటింగ్‌లోనూ సహాయం చేస్తారు. యూనిట్ పెట్టిన వారు కనీసం ఒకరికి ఉద్యోగం ఇస్తే, యూనిట్ విస్తరణకు రుణాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రారంభం కానుంది. మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లను గుర్తించి, వాటిని జీవనోపాధి యూనిట్లు, ఎంటర్‌ప్రెన్యూర్ యూనిట్లు, ఎంటర్‌ప్రైజెస్ యూనిట్లుగా విభజిస్తారు. ఈ వివరాల ఆధారంగా మహిళలకు రుణాలు, ఆర్థిక సహాయం అందించనున్నారు. స్త్రీనిధి పథకం, ఎస్సీ/ఎస్టీ ఉన్నతి పథకం వంటి వాటి ద్వారా రూ.10 వేలు నుంచి రూ.10 లక్షల వరకు సాయం అందించనున్నారు.
చాలామంది మహిళలు ఇప్పటికే పేపర్ ప్లేట్స్, దినుసుల పొడులు, డెయిరీ, పచ్చళ్ల తయారీ, టీషర్టులు, ఫ్యాన్సీ షాపులు, హోటళ్లు వంటి వ్యాపారాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. వీరి పరిశ్రమలకు సంబంధించిన వివరాలను డీఆర్‌డీఏ యాప్‌లో ఫోటోలు, వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు అధికారులు సంప్రదిస్తే మరిన్ని వివరాలు, మార్గదర్శకాలు పొందవచ్చు.