స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఆటో స్వీప్ (Auto Sweep) సేవలో కనీస పరిమితిని మార్చింది. గతంలో ఈ పరిమితి రూ.35,000గా ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.50,000కు పెంచింది. అంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్ రూ.50,000 దాటినప్పుడే అదనపు మొత్తం ఆటోమెటిక్‌గా మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD)లోకి బదిలీ అవుతుంది. దీంతో కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది.
MOD పథకం కస్టమర్లకు ప్రయోజనకరమైనది. ఈ పథకంలో, పొదుపు ఖాతాలో మిగిలే అదనపు మొత్తాన్ని బ్యాంక్ టర్మ్ డిపాజిట్‌కి మార్చుతుంది. తిరిగి అవసరం ఉన్నప్పుడు రివర్స్ స్వీప్ ద్వారా MODలోని మొత్తాన్ని ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇది రూ.5,000 యూనిట్లుగా జరుగుతుంది. అలాగే తాజా డిపాజిట్ నుంచే ముందుగా ఉపసంహరణ అవుతుంది (LIFO). కస్టమర్ కోరుకుంటే, పాత డిపాజిట్ నుంచీ (FIFO) ప్రారంభించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
వడ్డీ రేట్లు సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువగా ఉంటాయి. త్రైమాసిక ప్రాతిపదికన చెల్లిస్తారు. చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. మధ్యలో MODని బ్రేక్ చేస్తే, ఆ కాలానికి వడ్డీ ఇస్తారు కానీ కొద్దిగా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. వడ్డీపై TDS వర్తిస్తుంది. మెచ్యూరిటీ అయ్యాక మొత్తం వడ్డీతో సహా ఆటోమేటిక్‌గా సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది.
సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కూడా ఉంది. వారికి అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. అయితే 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ వర్తించదు. మొత్తంగా SBI తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు మరింత లాభదాయకం అవుతుందని నిపుణులు అంటున్నారు.