ప్రాథమిక స్థాయినుంచి విద్యార్థుల్లో భక్తి, మానవీయత, నైతిక విలువలను పెంపొందించేందుకు టిటిడి విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌తో కలసి 'సద్గమయ శిక్షణ కార్యక్రమం'ను ప్రారంభించింది. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో టిటిడి యాజమాన్యంలోని 7 పాఠశాలల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
శిక్షణకు ఎస్.జీ.ఎస్. హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్‌కెఆర్‌ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తాటితోపులోని ఎస్‌కెఎస్ హైస్కూల్, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ ఎంపికయ్యాయి. 8, 9, 10 తరగతి విద్యార్థులకు రోజుకు ఒక గంట చొప్పున నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతోంది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తి భావం, భగవద్గీత పరిచయం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, మన సంస్కృతి–సాంప్రదాయాలపై విశ్లేషణాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులు ఈ తరగతులకు పాఠాలు చెబుతున్నారు. శిక్షణ ముగిసిన అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.
తిరుపతి ఎస్.జీ.ఎస్. హైస్కూల్‌లో జరిగిన ఓ శిక్షణ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిఈవో వెంకట సునీల్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.