Dark chocolate healthy tips: చాక్లెట్ పేరు వినగానే అందరి ముఖాల్లో చిరునవ్వు విరుస్తుంది. కానీ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండే వారు డార్క్ చాక్లెట్ నే ఎక్కువగా ఎంచుకుంటారు. ఎందుకంటే ఇది కేవలం తీపి రుచికే కాదు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే చాలామందికి ఒకే సందేహం రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినడం సరైనదేనా? అనే సందేహం ఉంటుంది.
డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తప్రసరణను మెరుగుపరచడం రక్తపోటును నియంత్రించడం, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇందులో ఉండే పదార్థాలు మెదడు పనితీరును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయని ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తిన్న తర్వాత మనసు హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో సెరోటోనిన్ ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి హ్యాపినెస్ హార్మోన్లు గా పిలుస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఇవి సహజంగా మూడ్‌ను మార్చేస్తాయట.
రాత్రి వేళల్లో డార్క్ చాక్లెట్ తినడంపై నిపుణులు కొంత జాగ్రత్త సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో కెఫిన్, థియోబ్రోమిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి ఉద్దీపకాలు కావడంతో నిద్ర పూట శరీరం సడలకుండా ఉంచుతాయి. దాంతో కొందరికి నిద్ర రావడం ఆలస్యం కావడం లేదా నిద్ర నాణ్యత తగ్గిపోవడం జరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా నిద్రకు ముందు తినడం వలన యాసిడ్ రిఫ్లక్స్, కడుపు మంట లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలున్నవారు రాత్రిపూట చాక్లెట్ తినడం మానేయడం మంచిది. డార్క్ చాక్లెట్లో చక్కెర తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మోతాదులో తింటే తీపి కోరికలు పెరుగుతాయి. దీంతో బరువు పెరగడం, చక్కెర స్థాయిలు మారడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజుకి చిన్న ముక్క మాత్రమే అదీ 70% కోకో ఉన్న చాక్లెట్ తినడం ఆరోగ్యానికి ఉత్తమమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొద్దిగా డార్క్ చాక్లెట్ తినడం మంచిది. రాత్రిపూట తినాలనిపిస్తే కూడా నిద్రకు ఒకటి లేదా రెండు గంటల ముందే తినాలి అంతకుమించి తీసుకుంటే నిద్రకు భంగం కలగవచ్చు.
డార్క్ చాక్లెట్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మితంగా తీసుకోవడమే మంచిది. అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా నష్టాన్నే కలిగిస్తుంది. మీకు కెఫిన్‌కు సున్నితత్వం లేదా నిద్ర సమస్యలు ఉంటే రాత్రిపూట దీన్ని దూరంగా పెట్టండి. కానీ సరైన సమయానికి, సరైన పరిమాణంలో తీసుకుంటే ఇది శరీరానికి, మనసుకు ఒక సహజ బూస్టర్‌లా పనిచేస్తుంది.
ముఖ్యమైన సూచన ఇది కేవలం మీ ఆహ్వానకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించవలెను.