విశాఖలోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు
చేసే అంశాన్ని పరిశీలించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్ను కోరారు.
ఏపీతో ఇప్పటికే ఎంవోయూలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు తాజా ప్రతిపాదనపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బ్రెన్స్ బదులిచ్చారు. గూగుల్ క్లౌడ్ డైరక్టర్ విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసినందున సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.
చైనా/తైవాన్కు దూరంగా ఏపీలో తయారీని ప్రారంభించడానికి గూగుల్.. ఏపీ ద్వారా సర్వర్ సప్లయ్ చైన్ ను కనెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ క్లౌడ్, సర్వర్ సరఫరాదారు దాని మరమ్మత్తు, నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్గా ఏపీని ఉపయోగించుకోవచ్చని సూచించారు.
బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉన్నందున అటువంటి కార్యకలాపాలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.