India Aviation industry : భారత్ విమానయాన రంగం ఇప్పుడు కొత్త దిశలో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఇప్పుడు సాధారణ ప్రజల ప్రయాణాలకోసం విమానాలను తయారు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ లక్ష్యంతో రష్యాలోని యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC)తో భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యంతో SJ–100 పేరుతో చిన్న పరిమాణంలో ప్రయాణికుల విమానాలు దేశంలోనే తయారవుతాయి. ఇది భారతదేశ పౌర విమానయాన చరిత్రలో ఒక మైలురాయి అవుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో పూర్తిస్థాయి ప్రయాణికుల విమానం తయారీ జరగలేదు. ఈ ప్రాజెక్ట్‌తో ఆ ఖాళీ నిండిపోనుంది.
ఈ కొత్త విమానం రెండు ఇంజిన్లు కలిగిన తేలికపాటి మోడల్. దాదాపు 100 మంది ప్రయాణికులను మోసే సామర్థ్యం ఉంది. తక్కువ దూర ప్రయాణాలకు, దేశీయ మార్గాలకు ఇవి అత్యంత అనుకూలం. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో దేశీయ ఎయిర్లైన్లకు ఇది మంచి ఆప్షన్‌గా మారుతుంది.
ప్రస్తుతం రష్యాలో తయారైన SJ–100 జెట్లు 16 దేశాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు భారత్‌లో తయారవుతున్న విమానాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా మోడిఫై అవుతాయి. అంటే మన ఎయిర్‌పోర్ట్‌ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ పరిస్థితులకు సరిపోయే డిజైన్ రూపంలో వస్తాయి.
ఈ ఒప్పందం కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు – రెండు దేశాల మధ్య ఉన్న సాంకేతిక స్నేహానికి కొత్త అధ్యాయం. అక్టోబర్ 27, 2025న మాస్కోలో HAL ప్రతినిధి ప్రభాత్ రంజన్, రష్యా UAC తరపున ఒలెగ్ బోగోమోలోవ్ సంతకాలు చేశారు. రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల మధ్య, భారత్‌ను తమ తయారీ కేంద్రంగా ఎంచుకోవడం కూడా ఒక వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో దేశంలో వందలాది ఇంజినీర్లు టెక్నీషియన్లు, స్థానిక సరఫరా సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. మేక్ ఇన్ ఇండియాస్ఫూర్తికి ఇది నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది.
వచ్చే పది సంవత్సరాల్లో భారత్‌లో చిన్న దూర ప్రయాణాల కోసం కనీసం 200 జెట్లు అవసరం అవుతాయని అంచనా. ఈ ప్రాజెక్ట్ ఆ డిమాండ్ తీర్చడమే కాదు, ఆసియా ప్రాంతంలో భారత్‌ను విమాన తయారీ కేంద్రంగా నిలబెట్టగలదని నిపుణులు చెబుతున్నారు.
భారత్ 1961లో HS–748 విమానాలను తయారు చేసిన తర్వాత ఇంత పెద్ద పౌర విమాన ప్రాజెక్ట్ ఇదే మొదటిసారి. దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ విమాన తయారీలో కొత్త అధ్యాయనం రాయనుంది. రష్యా సహకారంతో దేశీయ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. ఈ ఒప్పందం వల్ల భారత్ కేవలం విమానాలను కొనుగోలు చేసే దేశం కాదు తయారు చేసే దేశం గా కూడా పేరు తెచ్చుకుంటుంది.