దేశంలో ఇటీవల వీధి కుక్కల సమస్య చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఢిల్లీలో వీధి కుక్కలను తరలించే నిర్ణయంపై యానిమల్ లవర్స్ పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. దీనికి అనుకూలంగా, ప్రతికూలంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. ఈ నేపథ్యంలో యానిమల్ లవర్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రధాని మోదీ తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన యానిమల్ లవర్స్ డబుల్ స్టాండర్డ్స్ గురించి ప్రస్తావించారు. “నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్‌ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్స్‌గా పరిగణించరు” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు విన్నవారు చప్పట్లతో స్పందించారు.
మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న సందేశం స్పష్టమే. మన సమాజంలో జంతు హక్కుల పేరుతో కొందరు ఒక సమస్యపై మాత్రమే స్పందించి, మరొక దానికి మౌనం వహిస్తారని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. వీధి కుక్కల విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు, చర్చలు జరుగుతున్నా, గోమాత సంరక్షణ, పశువుల సంక్షేమం వంటి అంశాలపై చాలా మంది యానిమల్ లవర్స్ స్పందించకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. యానిమల్ లవర్స్‌లో కొందరు మోదీ వ్యాఖ్యలను విమర్శిస్తూ, తాము అన్ని జంతువుల పట్ల సమాన గౌరవం చూపుతున్నామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, నిజంగానే కొందరు ఎంపికచేసిన సమస్యలకే మాత్రమే పోరాడుతున్నారని అంగీకరిస్తున్నారు.
ప్రస్తుతం వీధి కుక్కల సమస్య దేశంలోని చాలా నగరాల్లో తీవ్రమైన స్థాయికి చేరింది. రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే కుక్కల వల్ల పౌరులు, ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒకవైపు ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతుంటే, మరోవైపు జంతు హక్కుల పేరుతో వీధి కుక్కల తరలింపుని అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మోదీ వ్యాఖ్యలు ఒక కొత్త కోణాన్ని తీసుకువచ్చాయి.
ప్రధాని ప్రసంగం తరువాత రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. బీజేపీ నాయకులు మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తూ, యానిమల్ లవర్స్ నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపక్షం మాత్రం మోదీపై విమర్శలు చేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రధానమంత్రికి తగదని అంటోంది.
ఏదేమైనా, మోదీ సెటైర్లు యానిమల్ లవర్స్‌పై కొత్త చర్చకు దారితీశాయి. జంతు హక్కులపై సమాజంలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను బయటపెట్టే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. ఇకపై యానిమల్ లవర్స్ తాము చేసే ఉద్యమాలను మరింత సమగ్రంగా, సమానంగా కొనసాగిస్తారా అన్నది చూడాలి.