మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన గణేష మహోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా నిలిచాయి.
ఈ వేడుకల్లో దిల్సే ఆస్ట్రేలియా (Dilse Australia) బృందం ముఖ్యపాత్ర వహించారు. వారిలో ప్రముఖులు వినీలా బండ్లమూడి, యశ్వంత్ మరియు హర్ష రెడ్డి గారు. వినాయకుడికి పూజలు మన తెలుగు సంప్రదాయాలను అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో నిర్వహించగా, స్థానిక తెలుగు సమాజం విస్తృతంగా పాల్గొని ఉత్సవానికి విశిష్టతను చేకూర్చింది.
ఈ మహోత్సవంలో రాధామనోహర్ దాస్ గారు కూడా పాల్గొని, మన సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా నేటి తరం వారికి ఆ సంప్రదాయాలను చేరవేయడం ఎంత అవసరమో చెప్పారు. ఈ సందర్భంగా లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TDP మెల్‌బోర్న్ అధ్యక్షులు లగడపాటి సుబ్బారావు గారు స్వామివారి లడ్డూను 10,019 డాలర్లకు (సుమారు రూ.8,33,581) విజయవంతంగా దక్కించుకోవడం ఈ వేడుకలో ముఖ్య ఘట్టంగా నిలిచింది.
ఆ లడ్డూను రాధామనోహర్ దాస్ గారి చేతుల మీదుగా “Dilse Australia” బృందం వారి కుటుంబానికి బహుకరించడం విశేషంగా ఆకట్టుకుంది. వేడుకల్లో పాల్గొన్న అందరూ మరియు NRI టీడీపీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో TDP మెల్‌బోర్న్ ఉపాధ్యక్షులు గోపీ నంబాల గారు కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు, కుటుంబాలు ఉత్సవంలో భాగస్వాములై ఆనందాన్ని పంచుకోవడంతో వేడుకకు మరింత వైభవం చేకూరింది.