ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లో ఉంది. తాజాగా అధికారులు ఈ పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం లభించనుంది.
గ్రౌండ్ బుకింగ్ బస్సులంటే కండక్టర్ లేకుండా నడిచే, కొద్ది స్టాప్‌లలో మాత్రమే ఆగే ప్రత్యేక బస్సులు. వీటిలో టికెట్లు బస్టాండ్‌లోనే ఇస్తారు. ఈ కేటగిరీలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఇకపై వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, సింహాచలం కొండకు వెళ్లే సిటీ బస్సులకు టోల్ మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకు లేఖ రాశారు. తిరుమల మినహా రాష్ట్రంలోని 39 ఘాట్ రోడ్లపై తిరిగే బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని చెప్పారు.
ఇదిలా ఉంటే, బొబ్బిలి–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ బస్సులో సీటు కోసం ఓ పురుషుడు, ఓ మహిళ వాగ్వాదం చేసుకున్నారు. ఇద్దరూ బూతులు తిట్టుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు, ఆ ఇద్దరిపై కేసు పెట్టాలని పార్వతీపురం డిపో అధికారులకు ఆదేశించారు. అలాగే, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉచిత ప్రయాణం కారణంగా రద్దీ పెరుగుతుండటంతో, కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది.