అదానీ సోలార్ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకేటాయింపు దిశగా ముందడుగు వేసింది. మరోవైపు రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ఉచితంగా కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఈ పాస్‌బుక్‌లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుందని, రాజకీయ పార్టీల గుర్తులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తప్పులు లేకుండా అత్యంత జాగ్రత్తగా ముద్రించామని, ప్రస్తుతం 21 లక్షల పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
రికార్డులలో తప్పుల సవరణ
గత ప్రభుత్వ తొందరపాటు రీ–సర్వే వల్ల భూ రికార్డుల్లో అనేక లోపాలు వచ్చాయని మంత్రి విమర్శించారు. వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి 6,688 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 2.79 లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. అలాగే 17,600 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 1.85 లక్షల ఫిర్యాదులను తీర్చామన్నారు. రైతులు భూ రికార్డుల మార్పులు చేసుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చి, వాటిని లైవ్ వెబ్‌ల్యాండ్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేశామని వివరించారు.
రైతులకు భరోసా
కొత్త పాస్‌బుక్‌ల డేటా నేరుగా లైవ్ వెబ్‌ల్యాండ్ నుండి వస్తుందని, ప్రింటింగ్ తర్వాత కూడా కలెక్టర్ స్థాయి క్రాస్ చెకింగ్ జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఇప్పటి వరకు ఒక్క తప్పు పాస్‌బుక్ కూడా ఇవ్వలేదు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని భరోసా ఇచ్చారు. అవసరమైతే ఉచితంగా సవరణలు చేస్తామని హామీ ఇచ్చారు.
పంట రుణాలు & కౌలు రైతులు
పంట రుణాలకు కొత్త పాస్‌బుక్ తప్పనిసరి కాదని మంత్రి తెలిపారు. బ్యాంకులు నేరుగా వెబ్‌ల్యాండ్ డేటాబేస్ ద్వారా భూ యజమానిని గుర్తిస్తాయని, దీంతో మోసాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. అలాగే కౌలు రైతుల పేర్లు పాస్‌బుక్‌ల్లో ఉండవనే వాదనను తోసిపుచ్చారు. అధికారిక 1B రికార్డుల నుంచే పేర్లు ప్రింట్ అవుతాయని, కౌలుదారుల జాబితా ఉండదన్నారు. ఈ చర్యల వల్ల రైతులకు భూ రికార్డులలో పూర్తి పారదర్శకత వస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.