ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా కాకుండా, అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళల ఉచిత బస్సు పథకం ముఖ్యమైందని గుర్తు చేశారు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల తరహాలోనే ఏపీలోనూ ఈ పథకం అమలవుతుందని చెప్పారు. ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండే పథకం ఇదే కావడంతో.. త్వరలోనే దీనికి ప్రత్యేకమైన పేరును ప్రభుత్వం ఖరారు చేయనుందని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మండిపల్లి ఫైర్
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు రోజు 18 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. గతంలోనే అమరావతిని సింగపూర్ తరహాలో నిర్మించాలన్న దిశగా ప్రయత్నాలు చేశామని.. సింగపూర్ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయించామని వివరించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించినా, ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని నిప్పులెత్తారు. చంద్రబాబు ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి కృషి చేస్తుంటే.. వైసీపీ అసత్య ప్రచారాలతో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్చుకోలేకే వైసీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు.
రోజాపై విమర్శలు
మాజీ మంత్రి రోజాపై కూడా మండిపల్లి మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు రోజా క్రమశిక్షణతో ఉండేవారని.. కానీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆ క్రమశిక్షణను కోల్పోయారని విమర్శించారు. మహిళలపై తాము విమర్శలు చేయలేమని స్పష్టంగా చెప్పిన ఆయన.. తమ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం ఉన్నదని అన్నారు. జగన్ వద్ద మెప్పు పొందేందుకే రోజా ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.