తమిళనాడు-ఏపీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఏనుగుల గుంపులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సోమల మండలం కొత్తూరు గ్రామంలో ఏనుగుల దాడితో ఓ రైతు మరణించిన ఘటన కలకలం రేపింది. భక్తులు నడిచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలోనూ ఏనుగుల సంచారం భయాందోళనలు రేకెత్తిస్తోంది. మంగళవారం శ్రీవారిమెట్టు పంప్ హౌస్ వద్ద 11 ఏనుగులు (4 పిల్ల ఏనుగులతో సహా) సంచరించినట్లు టీటీడీ డ్రోన్ కెమెరాల్లో గుర్తించింది.
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కాలనీలు, పొలాలు ఏనుగుల వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయని అధికారులు తెలియజేయగా, పవన్ కళ్యాణ్ సమస్యను అత్యంత గంభీరంగా పరిగణించారు.
ఏనుగుల కదలికలను తెలుసుకోవడానికి డ్రోన్ టెక్నాలజీని మరింతగా వినియోగించాలని సూచించారు. ఏనుగులు సంచరించే అవకాశమున్న మార్గాల్లో ప్రజలను ముందుగా అప్రమత్తం చేయాలని, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. ఈ చర్యలను డి.ఎఫ్.ఓ. కార్యాలయాలు, పి.సి.సి.ఎఫ్. కార్యాలయం పర్యవేక్షించాలని సూచించారు.
ఏనుగులు పొలాల్లోకి రాకుండా అటవీ ప్రాంతాల్లోకి తరలించే చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల భద్రతకే, పంటలకు నష్టం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.