వైకాపా హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appalanaidu) అన్నారు. అప్పటి విధ్వంసం నుంచి ఏపీని బయటకు తెచ్చి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
దిల్లీలో సహచర ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి కలిశెట్టి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ఏడాదిగా జగన్ అండ్ కో దుష్ప్రచారాలు చేస్తున్నారని కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. శవరాజకీయాలను ఆయన విరమించుకోవాలని హితవు పలికారు.
పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. ఆయనకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వరన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు, ఆయన విజన్కు అన్నిచోట్లా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు.
బైరెడ్డి శబరి మాట్లాడుతూ వైకాపా హయాంలో ఉన్న పరిశ్రమలను కూడా తరిమేశారని విమర్శించారు. జగన్ పాలనలో రైతులకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్కు వందశాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
త్వరలో 'అన్నదాత సుఖీభవ' నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. వైకాపా అధికారంలో ఉండగా రైతుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించారని.. మద్యం కుంభకోణం కంటే ఇది భారీ స్కామ్ అని అన్నారు.